ప్రస్తుతం మహానటి సావిత్రి బయోపిక్‌గా 'మహానటి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో వేడుకకు నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్‌లు ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఇక నాగార్జున కుమారుడు నాగచైతన్య ఇందులో ఏయన్నార్ పాత్రని పోషించడం, కోడలు సమంత జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో నటించడంతో నాగార్జున ఈ వేడుకకు రావడంలో వింతేమీ లేదు. ఇక నాగ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్, ఏయన్నార్, సావిత్రిలు లేకపోతే తెలుగు సినీ పరిశ్రమ లేదు. ముఖ్యంగా మూగమనసులు, డాక్టర్‌చక్రవర్తి, మిస్సమ్మ వంటి అనేక చిత్రాలను మిస్ అయ్యేవారం. ఎవరి మీద అయినా బయోపిక్ తీయాలంటే వారికి అంత పేరు ప్రతిష్టలు, ఆ హోదా ఉండాలి. సావిత్రి గారికి అది ఉంది. అంతటి మహనీయురాలు, అందునా మహిళ మీద వస్తున్నఈ బయోపిక్‌ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. సావిత్రిగారు ఈ గౌరవానికి పూర్తిగా అర్హురాలు.
ఇక ఇందులో మా నాన్నగారి పాత్రను చైతు ఎలాచేశాడో చూడాలి...! ఇక నాకైతే ఆ పాత్ర చేయలేదని ఉంది. మరి తారక్ మనసులో ఏముందో? ఇక ఈచిత్రం తీసిన స్వప్న, ప్రియాంకా, నాగ్‌అశ్విన్ వంటి వారికి కీర్తిసురేష్, దుల్కర్ సల్మాన్ వంటి వారికి సావిత్రి అంటే ఎవరో తెలియదు. కానీ వారు ఈ ప్రయోగం చేస్తున్నారు. నా తెరంగేట్రం సావిత్రిగారి చేతులు మీదుగా 'వెలుగునీడలు'లో జరిగింది. దాంతో ఆమె క్రేజ్ నాక్కూడా కొంచెం వచ్చింది.
ఇక ఓ మహిళా మూర్తి మీద బయోపిక్ తీయడం, అందునా స్వప్నాదత్, ప్రియాంకా దత్‌లతో పాటు 20మంది లేడీ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు. ఇక ఈ సెట్ వేసింది కూడా అమ్మాయిలేనట. దీనిని బట్టి మహిళలకు మన ఇండస్ట్రీ ఇచ్చేగౌరవం ఏమిటో అర్ధమవుతుంది.. అంటూ శ్రీరెడ్డి, కాస్టింగ్‌కౌచ్, మీడియా సంగతులు ఎత్తకుండా నాగార్జున మాట్లాడటం విశేషం.