సినిమాలలో నటించేటప్పుడు ఆ సినిమా పూర్తయ్యే వరకు నటీనటులు ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తారు. అందునా జీవిత చరిత్రల్లో నటించేటప్పుడు వారు మరింతగా ఇన్‌వాల్వ్ కావడం వల్ల షూటింగ్ పూర్తి అయినా కూడా ఆ పాత్రల ప్రభావం నుంచి బయటకి రావడం అంత సులువు కావు. అదే పాత్రలో వారు లీనమైపోతారు. ఇక దాదాపు ఒకటిన్నర ఏళ్లుగా కీర్తిసురేష్ సావిత్రి బయోపిక్ 'మహానటి'లో యాక్ట్ చేస్తోంది. ఈ చిత్రం మొత్తం ఆమె సావిత్రిలా నడక, బొట్టు, హావభావాలు, ఆమెలా కనించే విధంగా నడవటం, మాట్లాడటం వంటి వన్నీ చేస్తూ ఉంది. దాంతో ఆమె ఇప్పుడు సావిత్రి పాత్ర నుంచి బయటికి రాలేకపోతున్నానని, తాను కీర్తిసురేష్‌ని కాదు.. సావిత్రినే అనే బలమైన ముద్ర తన మనసుపై పడిందని కీర్తిసురేష్ అంటోంది.
ఇక ఎవరి బయోపిక్ అయినా వారి చిన్నతనం, నాటి యవ్వనం దశలో కనిపించే సమయంలో ఆయా పాత్రలను చేసేవారి ఎంపిక క్లిష్టతరంగా మారుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య చేస్తున్నా, ఎన్టీఆర్ చిన్నతనం, యవ్వనంలో ఉన్నప్పటి పాత్రలకు ఎవరిని తీసుకుంటారో అనే ఆసక్తి రేగడం సహజం. ఇక 'మహానటి' సావిత్రి విషయానికి వస్తే ఇందులో చిన్ననాటి సావిత్రి పాత్రను నటకిరీటీ రాజేంద్రప్రసాద్ మనవరాలు పోషిస్తోంది. రాజేంద్రప్రప్రాద్ మనవరాలి పేరు నిశంకర. ఈమె సావిత్రి చిన్ననాటి పాత్రను చేస్తుండగా, 'హాయ్‌రబ్బా' స్మిత కుమార్తె శివి.. సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరిగా చేస్తోంది. దీనికి సంబంధించిన స్టిల్స్‌ని హాయ్‌రబ్బా స్మిత సోషల్ మీడియాలో విడుదల చేయగా, ఇవి బాగా వైరల్ అవుతున్నాయి. తల్లి సావిత్రి, తండ్రి జెమినీ గణేషన్‌తో నా కుమార్తె అంటూ కీర్తిసురేష్, దుల్కర్ సల్మాన్‌లతో ఉన్న ఫొటోలు స్మిత పోస్ట్ చేసింది.