ఎంతటి బిజీలో నైనా నిన్న మొన్నటి వరకు రవితేజ ఏడాదికి మూడు చిత్రాలు చేస్తూ నిర్మాతలదర్శకునిగా పేరు తెచ్చుకుని, మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన తర్వాత నాని కూడా ఏడాదికి మూడు చిత్రాల దాకా చేస్తూ ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండానే నేచురల్ స్టార్‌గా మారాడు. వరుసగా ఎనిమిది హిట్స్ ఇచ్చి తాజాగా వచ్చిన 'కృష్ణార్జునయుద్దం'తో నిరాశ పరిచాడు. ఇప్పుడు ఇదే కోవలోకి అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ కూడా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. 'పెళ్లిచూపులు' హిట్ అయిన తర్వాత ఆయన 'అర్జున్‌రెడ్డి' ద్వారా మాత్రం ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.
ఇక తాజాగా ఆయన నటించిన 'మహానటి' విడుదలైంది. ఇక ఈయన ప్రస్తుతం వైజయంతీ మూవీస్, గీతాఆర్ట్స్, యువి క్రియేషన్స్ వంటి పలు ప్రతిష్మాతక బేనర్లలో చేస్తున్నాడు. ఇక ఈయన చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. ఇక ఈయన రాహుల్ సాంకృత్యయన్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ గీతాఆర్ట్స్2, యువి క్రియేషన్స్ బేనర్‌లో 'ట్యాక్సీవాలా' పూర్తయింది. అయితే ఈ చిత్రం మే 18న విడుదల కావడం లేదు. ఇప్పటికీ గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తి కాకపోవడం మరోవైపు అల్లు అరవింద్, బన్నీవాస్ వంటి వారు అల్లు అర్జున్ 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా'ను గట్టెక్కించే పనులలో బిజీగా ఉండటం వల్ల ఈ చిత్రం విడుదల జూన్‌కి వాయిదా పడింది.
ఇక 'ట్యాక్సీవాలా' చిత్రం ఓ క్యాబ్ డ్రైవర్‌కి ఓ దెయ్యానికి సంబంధించిన కథగా రూపొందుతోంది. ఇక ఆయన పరుశురాం దర్శకత్వంలో కూడా గీతాఆర్ట్స్2, యువి క్రియేషన్స్‌లో రూపొందుతున్న చిత్రం కూడా చివరకు వచ్చింది. దీని తర్వాత ఆయన పెళ్లిచూపులు నిర్మాత అయిన రాజ్‌కందుకూరి నిర్మాణంలో 'మెంటల్‌మది'లో దర్శకుడు వివేక్ ఆత్రేయతో మరోచిత్రం ఒప్పుకున్నాడు.
ఇక విజయ్ తాజాగా మరో పెళ్లిచూపులు నిర్మాత యష్ రంగినేని నిర్మాణంలో భరత్ కమ్మ అనే నూతన దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ చిత్రం ఫిక్స్ అయ్యాడు. దీనికి 'డియర్ కామ్రేడ్' అనే టైటిల్‌ని పెట్టారు. ఇప్పటివరకు తెలంగాణ-హైదరాబాదీ యాస మాట్లాడిన విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో మాత్రం కాకినాడ భాషని మాట్లాడనున్నాడని సమాచారం. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ కూడా ఆకట్టుకుంటోంది. మొత్తానికి అర్జున్ రెడ్డి దూకుడు మామూలుగా లేదు.