బాపుబొమ్మగా 'అత్తారింటికి దారేది'తో అందరినీ ఆకట్టుకున్న కన్నడ భామ ప్రణీత 'బ్రహ్మోత్సవం' తర్వాత మరే చిత్రంలో కనిపించలేదు. ఇక ఈమె తాజాగా దిల్‌రాజు బేనర్‌లో 'సినిమా చూపిస్త మావా' దర్శకుడు త్రినాధరావునక్కిన దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న 'హలో గురూ ప్రేమకోసమే' చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చాలా మంది నాది కంబ్యాక్ మూవీ అంటున్నారు. కానీ నేను గతకొంత కాలంగా కన్నడ, తమిళ చిత్రాలలో నటిస్తూనే ఉన్నాను. నాకు ఇది కమ్‌బ్యాక్ మూవీ అనిపించడంలేదు. అలాంటి ఫీలింగ్ ఏమీ నాకు లేదు. కాకపోతే తెలుగులో కాస్త ఎక్కువ గ్యాప్ వచ్చింది.
నాకు నచ్చిన చిత్రాలు చేసుకుంటూ పోవడమే నా ఫిలాసఫీ. కథలో ఇంపార్టెన్స్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. నేను ఎప్పుడు కాస్త గ్యాప్ తీసుకుని నటించినా దానిని ప్రజలు కంబ్యాక్ మూవీ అంటారు. అది సరికాదు. నేను ఏ చిత్రానికి సంతకం చేయాలన్నా చాలా సమయం తీసుకుంటాను. నా మొదటి చిత్రం నుంచి నాకు నచ్చిన ఆసక్తి కలిగించిన చిత్రాలు మాత్రమే చేస్తూ వచ్చాను. నేను కథ విన్నప్పుడు అది వైవిధ్యంగా ఉందా? లేదా? అని ఆలోచిస్తాను.
నేను ప్రస్తుతం నటిస్తున్న 'హలో గురు ప్రేమకోసమే' చిత్రం మంచి ప్రేమకథ, ఇందులో సిటీకి చెందిన అమ్మాయిగా నటిస్తున్నాను. నేను నాలాగే ఉండేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. నాకు తెలుగు వచ్చు కాబట్టి ఈపాత్రకి న్యాయం చేయగలను. అల్లుడికి, మామకి జరిగే పోరుగా ఈ చిత్రం ఉంటుంది. అల్లుడుగా రామ్, మామగా ప్రకాష్‌రాజ్ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది.. అని చెప్పుకొచ్చింది. 'సినిమా చూపిస్తా మావా' ఫార్మాట్‌లోనే మామ అల్లుడు గొడవగానే దర్శకుడు త్రినాధరావ్ నక్కిన తెరకెక్కిస్తున్న చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి..!