'బ్రహ్మోత్సవం' డిజాస్టర్‌గా నిలిచిన తర్వాత తప్పంతా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలదేనని అందరు తీర్మానించారు. కానీ దానిలో తన పాత్ర కూడా ఉందని, తన ఎంపిక లోపం వల్లనే అలా జరిగిందని చెప్పి మహేష్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఆ తర్వాత చిత్రాన్ని ఏకంగా మురుగదాస్ చేతిలో పెట్టి 'స్పైడర్' అంటూ ఒకేసారి ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళంపై కన్నేశాడు. కానీ ఈ చిత్రాన్ని మురుగదాస్ కూడా కాపాడలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పు ఎవరిది అనేది పక్కనపెడితే మహేష్ మాత్రం బాగా డిజప్పాయింట్ అయ్యాడనేది వాస్తవం. మరి ఈ రెండు చిత్రాల పరాజయ భారాన్ని మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను' ద్వారా తుడిచేశాడు.
ఇక చెన్నైలో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా 'బాహుబలి-దికన్‌క్లూజన్' నిలిచింది. దీనిని కొట్టే సత్తా ఎవ్వరికీ లేదని అందరు భావిస్తూ వచ్చారు. కానీ తమిళనాడులో సమ్మె కారణంగా కొత్త చిత్రాలు విడుదల కాకపోవడంతో 'రంగస్థలం' చిత్రం నాన్-బాహుబలి రికార్డులను కొల్లగొట్టింది. ఆ వెంటనే 'భరత్ అనే నేను' విడుదలైంది. సినిమా థియేటర్ల సమ్మె ముగిసినా కూడా మొదటి రెండు వారాలు పెద్ద తమిళ చిత్రాలు, క్రేజీ ప్రాజెక్ట్స్ విడుదల కాలేదు. దానిని 'భరత్ అనే నేను' బాగా సొమ్ము చేసుకుంది. ఇక తాజాగా 'భరత్ అనే నేను' చిత్రం 'బాహుబలి-ది కన్‌క్లూజన్' కలెక్షన్లను కూడా దాటి మొదటి స్థానంలో నిలవడం అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. ఈ విధంగా చూసుకుంటే చెన్నైలో 'బాహుబలి'ని మించిన వాడిగా 'భరత్' నిలిచాడు.
ఈ చిత్రానికి వచ్చిన స్పందన చూసి ఈ చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పైడర్ కోసం సొంతగా తమిళంలో డబ్ చెప్పుకున్న మహేష్‌కి ఆ చిత్రం ఆ కలని నెరవేర్చకపోయినా 'భరత్ అనే నేను'ని ఏమాత్రం అశ్రద్ద చేయకుండా ఓ స్ట్రెయిట్ ఫిల్మ్‌లాగా మహేషే డబ్బింగ్ చెప్పి విడుదల చేస్తే 'భరత్'తో తమిళ అసలైన ఎంట్రీ డబ్బింగ్ ద్వారా అయినా సరే మహేష్ విజయాన్ని చేజిక్కించుకోవడం సాధ్యం. అందునా ఈ చిత్రంలోని పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ తాజాగా తమిళనాడు పరిస్థితికి కూడా అద్దం పట్టేలా ఉండటం కలిసొచ్చే అంశమనే చెప్పాలి.