బిజెపి లెక్కల్లో చూసుకుంటే కర్ణాటకలో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా నిలిచి ఉండవచ్చు. కానీ ఓట్ల శాతం విషయంలో కూడా బిజెపి కంటే కాంగ్రెసే అగ్రస్థానంగా నిలవడం విశేషం. గెలుపు బిజెపిదే అయినా నైతిక విజయం మాత్రం కాంగ్రెస్‌దేనని చెప్పాలి. ముఖ్యంగా బెంగుళూరు సిటీతో పాటు తెలుగు వారు ఎక్కువగా ఉండే ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో బిజెపి అభ్యర్దులు ఘోరంగా పరాజయం పాలయ్యారు. భాగేపల్లి నుంచి పోటీచేసిన తెలుగు సినీనటుడు సాయికుమార్ ఘోరపరాజయం పాలయ్యాడు. దీనికి కారణం ఆయన బిజెపి తరపున పోటీ చేయడమేనని చెప్పాలి.
ఈయనకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదంటే ఈయన అపజయం మరీ ఇంత అధ్వాన్నంగా ఉంటుందని ఎవ్వరూ భావించలేదు. గతంలో అదే స్థానం నుంచి సాయి ఓడిపోయినా కూడా నాటి పరిస్థితివేరు. ఇక ఈ ఎన్నికల్లో ఆయన సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇక రెండు మూడు స్థానాలలో సీపీఎం, జెడిఎస్‌లు నిలువగా సాయికి డిపాజిట్ గల్లంతయ్యింది.
బళ్లారి జిల్లాలోని కంప్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బిజెపి అభ్యర్ధి సురేష్‌బాబు ఈ స్థానాన్ని సునాయాసంగా గెలుస్తాడని అందరు భావిస్తే చంద్రబాబు, కేసీఆర్‌లు బిజెపికి ఓటు వేయవద్దని ఇచ్చిన పిలుపుతో ఆయన ఓడిపోయారు. ఇలా సాయికుమార్, సురేష్‌బాబుల మీద ఉన్న వ్యతిరేకత మీద కన్నా తెలుగు వారిలో బిజెపిపై ఉన్న కోపమే దీనికి కారణమైంది. ఇక కర్ణాటకలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉంటే చిక్ బళ్లాపూర్, రాయచూర్, బళ్లారి, కోలార్ వంటి జిల్లాలలో తెలుగు వారు ప్రభావితం చూపించగలిగే స్థానాలు దాదాపు 45కిపైగా ఉన్నాయని అంచనావేశారు.
వీటిల్లో 32 చోట్ల కాంగ్రెస్, 9 స్థానాల్లో జెడిఎస్ గెలవగా కేవలం ఐదు స్థానాలలో మాత్రమే బిజెపి గెలిచింది. అదే తెలుగు వారి వ్యతిరేకత లేని పక్షంలో కర్ణాటకలో బిజెపి సునాయస విజయం సాధించి, పూర్తి మెజార్టీని సాధించి ఉండేదనడంలో సందేహం లేదు.