ఆ మధ్య మోహన్‌లాల్ భీముని పాత్ర చేస్తూ మలయాళంలో వాసుదేవనాయర్ రాసిన 'రాండామూజం' నవల ఆధారంగా మలయాళంతోపాటు దేశవిదేశాలలో పలు భాషల్లో 'మహాభారతం' రూపొందనున్నారని వార్తలు వచ్చాయి. మొదట ఈ చిత్రంలో నాగార్జున కర్ణుడి పాత్రను పోషించనున్నాడని, శ్రీకుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని వెయ్యికోట్ల బడ్జెట్‌తో పలుభాషల్లో తీయనున్నారని వార్తలు వచ్చాయి. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి మొదలుకానుంది. ఈ చిత్రాన్ని యూఏఈకి చెందిన మోహన్‌లాల్ బిజినెస్ పార్ట్‌నర్ నిర్మించనున్నాడు.
ఇక ఇదే సమయంలో ముఖేష్ అంబానీ నిర్మాతగా మరో మహాభారతం రూపొందనుందని వార్తలు వచ్చాయి. నాడు అమీర్‌ఖాన్ కూడా తన డ్రీమ్‌ప్రాజెక్ట్ 'మహాభారతం' అని తెలిపాడు. ఇక ఈ చిత్రం కోసం పలువురు రచయితలు ఇప్పటికే స్క్రిప్ట్‌ను రాసే బాధ్యతలు అప్పగించడంతో వారు తమ పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో శ్రీకృష్ణుడిగా సల్మాన్‌ఖాన్, అర్జునుడుగా అమీర్‌ఖాన్, ద్రౌపతిగా దీపికా పడుకొనే నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రం పలువురి దర్శకత్వంలో నాలుగైదు భాగాలుగా పలు భాషల్లో బడ్జెట్‌కి వెనుకాడకుండా తీయనున్నారని అంటున్నారు. మొత్తానికి ఈ రెండు మహాభారతాలు త్వరలో ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మిగిలింది మన జక్కన్న మహాభారతం. బహుశా అంబాని తీసే మహాభారతంలో ఏదో ఒక పార్ట్‌కి రాజమౌళి పనిచేసినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. ఈరెండింటిలో ఏదో ఒకటి 2020లో ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని అంటున్నారు.