తమిళంలో ప్రముఖ రచయితగా పేరు తెచ్చుకున్న బాలకుమారన్ కన్నుమూశారు. ఆయన తమిళంలో పలు చిత్రాలకు రచయితగా పనిచేశాడు. ఈయన మృతిపట్ల తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. బాలకుమారన్ పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేశాడు. 'భాషా, కాదలన్, నాయకన్, జెంటిల్‌మేన్, సిటిజన్' తదితర చిత్రాలకు ఈయన పనిచేశారు.
ఇక 'ఈ భాషా ఒక్కసారి చెబితే..వందసార్లు చెప్పినట్లే' అనే డైలాగ్ ఎంత పవర్‌ఫుల్లో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం విడుదలై 23ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ ఈ డైలాగ్ అందరినోళ్లలో నానుతూనే ఉంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా ఆయన ఇంటికి వెళ్లి శ్రద్దాంజలి ఘటించారు. బాలకుమారన్ భౌతిక కాయానికి నివాళులర్పించిన రజనీ మాట్లాడుతూ.. బాలకుమారన్ నా ఆప్త మిత్రుడు. ఆయన మృతి నాకు తీరని లోటు. 'భాషా' చిత్రం పెద్ద విజయానికి ఆయన రాసిన డైలాగులే కారణం. నా సినిమాల కోసం ఆయనను తీసుకోవాలని భావించాను. కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదు. కుదరదని చెప్పారు. తన దృష్టిని సాహిత్యం, ఆధ్యాత్మికం మీద పెట్టినట్లు ఆయన తెలిపారు...అని రజనీకాంత్ చెప్పుకొచ్చాడు.
మొత్తానికి ఇన్ని ఘనవిజయాలు సాధించిన చిత్రాలకు వాటికి తగ్గ డైలాగ్స్‌ని అందిస్తూ, ఆయా చిత్రాల ఘనవిజయాలకు మూల స్థంభాలలోఒకరైన బాలకుమారన్ లేకపోవడం తమిళ చిత్ర సీమకు తీరని లోటేనని చెప్పాలి.