తాజాగా మహానటి సావిత్రి బయోపిక్‌గా 'మహానటి' వచ్చి సంచలన విజయం సాధించింది. ఇక సావిత్రి జీవితం అంటే అందులో సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ప్రేమ, పెళ్లి, భార్య, తల్లి, నటి, జీవిత చరమాంకంలో ఆమె పడిన కష్టాలు వంటి సినీ ట్విస్ట్‌లు ఎన్నో ఉన్నాయి. కానీ సౌందర్య జీవితం అలా కాదు. కన్నడ నటి అయిన ఈమె కన్నడ నాట కంటే తెలుగు, తమిళం వంటి భాషల్లోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. సావిత్రి, జయప్రద, జయసుధ వంటి వారిలాగే కేవలం నటనను తప్ప గ్లామర్‌షో చేయని నటిగా ఈమెకి పేరుంది. ఈమె తెలుగు, తమిళంలో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజనీకాంత్ ఇలా అందరితో కలిసి యాక్ట్ చేసింది.
ఇక సావిత్రి జీవితంలోలాగా సౌందర్య జీవితంలో పెద్దగా ట్విస్ట్‌లు లేవు. కేవలం చిన్నతనంలోనే బిజెపి ఎన్నికల ప్రచారం కోసం బెంగుళూరు నుంచి కరీంనగర్ వస్తూ ఉన్నఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవడమే ఆమె లైఫ్‌లో ట్రాజెడీ తప్ప ఆమె కెరీర్, అందులోని విశేషాలు సావిత్రి లాగా ఉండవు. ఇక అందునా సౌందర్య తల్లిదండ్రులతో పాటు ఆయన సోదరుడు కూడా బతికే ఉన్నాడు. దీంతో సౌందర్య జీవితంపై బయోపిక్ తీయాలంటే కొన్నిలేని విషయాలను కూడా చూపాల్సివుంటుంది. కానీ అందుకు ఆమె కుటుంబ సభ్యులు సమ్మతిస్తారా? అనేది పెద్ద ప్రశ్న.
ఇక తాజాగా 'పెళ్లిచూపులు, మెంటల్‌మదిలో' చిత్రాలను తీసిన రాజ్‌కందుకూరి సౌందర్య బయోపిక్ తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని సమాచారం. ఇక బయోపిక్‌ని ఎలా తీయాలి? అనే విషయంలో 'మహానటి' ఓ బెంచ్ కార్డుని క్రియేట్ చేసింది. కాబట్టి ఎన్టీఆర్, వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి వంటి పలువురి బయోపిక్‌లు 'మహానటి' కంటే అద్భుతంగా ఉండందే ప్రజలు ఆదరించరు. ఇలా సరికొత్త ట్రెండ్‌కి 'మహానటి' శ్రీకారం చుట్టింది. మరి సౌందర్య బయోపిక్‌ని తెరకెక్కించే దర్శకుడు ఎవరో తెలియాల్సిఉంది...!