డీజే సినిమా హిట్ టాక్ రాకపోయినా తనకున్న క్రేజ్ తో అదిరిపోయే కలక్షన్స్ రాబట్టాడు అల్లు అర్జున్. ఇక వక్కంతం వంశీకి అవకాశమిచ్చి నా పేరు సూర్యతో చేతులు కాల్చుకున్నాడు. నా పేరు సూర్య కనీసం లేడి ఓరియెంటెడ్ మూవీగా వచ్చిన మహానటి పోటీని కూడా తట్టుకోలేక చేతులెత్తేసింది. ఇక నా పేరు సూర్య సినిమా పోవడంతో కాస్త చికాకుగా ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఏ డైరెక్టర్ కి అవకాశం ఇస్తాడో గాని.. అందరూ అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నా పేరు సూర్య బిజినెస్ క్లోజ్ అయ్యే పరిస్థితుల్లో ఉంది. అందుకే ఈసారి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అల్లు అర్జున్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.
అల్లు అర్జున్ కి కొరటాల శివతో సినిమా చెయ్యాలని ఉంటే.. కొరటాల మాత్రం బన్నీకి అవకాశం ఇవ్వకుండా చిరంజీవి వైపు మొగ్గు చూపడంతో.. అల్లు అర్జున్ చివరికి ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ కి కమిట్ అవుతున్నాడని న్యూస్ హల్చల్ చేసింది. అయితే విక్రమ్ కుమార్ తో కథ సెట్ కాకపోవడంతో.. ప్రస్తుతం అల్లు అర్జున్ - విక్రమ్ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కే పరిస్థితి లేదు. అయితే అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య, రన్ సినిమాల దర్శకుడు అనీ కన్నెగంటి బన్నీకి ఒక కథ వినిపించాడట. అయితే అనీ కన్నెగంటి చెప్పిన కథ బాగా నచ్చడంతో.. బన్నీ ఆ కథతో సినిమా చేస్తా కానీ.. దర్శకుడిగా అనీ కన్నెగంటిని కాదని వేరే దర్శకుడి కోసం వేట మొదలెట్టాడట.
అనీ కన్నెగంటి చేసిన సినిమాలేవీ మంచి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో.. అల్లు అర్జున్ అతను చెప్పిన కథని భారీ రేటుకి కొనేసి... ఆ కథతో మరో దర్శకుడితో సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. మరి కథ ఓకే గాని... దర్శకుడు ఎవరనే దాని మీద ప్రస్తుతానికి సస్పెన్సు. ఎందుకంటే సుకుమార్ మహేష్ కి బోయపాటి రామ్ చరణ్ కి... ఇలా అందరు దర్శకులు బిజీగా ఉండడంతో.. బన్నీ కి దర్శకుడు దొరికే ఛాన్స్ ప్రస్తుతానికి లేదు. అలాగే కొత్త దర్శకుడికి అవకాశం ఇద్దాం అంటే.. వక్కంతంతో చేసిన ప్రయోగం విఫలమవడంతో.. ప్రస్తుతానికి కొత్త దర్శకుడు అనే పదం అల్లు అర్జున్ నోటి నుండి వినబడదు. మొత్తానికి బన్నీ మొదటిసారిగా బాగా ఇరుకున పడినట్లే అనిపిస్తుంది.