ఎస్.జానకి.. ఈమె ఎన్నో తరాల సంగీత శ్రోతలకు తన కమ్మనైన స్వరంతో వీనుల విందు చేస్తూనే ఉన్నారు. 5ఏళ్ల పాప లేదా బాలనటుడి నుంచి 60ఏళ్లకు పైబడిన నటీమణులకు కూడా తన గానంతో జీవం పోయడం జానకమ్మకే సాధ్యం. ఈ విషయంలో ఆమె స్వరం ఏ వయసు వారికైనా నిండుతనం తెస్తుంది. ఎన్నోతరాల సంగీత దర్శకులు, గాయకులతో కలిసి కోయిల స్వరాలను వినిపిస్తున్న జానకమ్మ దాదాపు 17కి పైగా భాషల్లో కలిపి 45 వేలకి పైగా గీతాలను ఆలపించి, రంజింపజేశారు. 2016లో ఓ మలయాళ పాట పాడిన తర్వాత స్వయంగా తనకు తాను రిటైర్‌మెంట్‌ని ప్రకటించుకుని తన గొప్పతనాన్ని ఆమె చాటుకున్నారు. ఆమె భారతదేశంలోని అన్ని భాషల్లోనే కాదు... సింహళ, జపనీస్, జర్మన్ వంటి విదేశీ భాషల్లో కూడా తన గానాన్ని వినిపించారు.
ఇక ఈమెకి నాలుగు జాతీయ అవార్డులతో పాటు 33 వివిధ రాష్ట్రాల బహుమతులు కూడా వచ్చాయి. ఇవ్వన్నీ ఆమె కీర్తికిరీటంలో మణి మకుటాలుగా నిలిచిపోయే సత్కారాలే. అయితే వాటి వల్ల ఆమెకి నిండుదనం రాకపోయినా ఆమె వల్ల ఆయా అవార్డులకే నిండుదనం వచ్చిందని చెప్పాలి. ఇక ఈమె మణిమకుటంలో మరో ప్రతిష్టాత్మక అవార్డు చేరనుంది. దేశం గర్వించదగ్గ గాయకుడు, గానగంధర్వుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం తన ప్రతి పుట్టినరోజు నాడు వివిధ రంగాలలో లబ్దప్రతిష్టులయిన వారికి తన పేరిట జాతీయ పురస్కారాలను అందిస్తూ ఉంటారు. ఈసారి ఎస్పీబాలసుబ్రహ్మణ్యం పేరిట ఇచ్చే జాతీయ పురస్కారాన్ని ఆయన జానకమ్మకి అందించనున్నాడు. శ్రీవిజేత ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ, 'జానకమ్మ ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరుకున్నాను. ఆమెని సత్కరించడం నా పూర్వజన్మ సుకృతమని' చెప్పుకొచ్చారు.