బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకి ఎంతో ఘనంగా శ్రీకారం చుట్టాడు. అయితే సినిమా విడుదలయ్యాక వివాదాలు చెలరేగుతాయనుకుంటే... సినిమా స్టార్ట్ అయిన కొద్ది రోజులకే ఆ సినిమా నుండి దర్శకుడు తేజ తప్పుకుని సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కానీ బాలయ్య అప్పటినుండి ఇప్పటివరకు సైలెంట్ గా ఉండి.. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తన ఎన్టీఆర్ బయోపిక్ ఆగిపోలేదని... ఈ సినిమాకి తనకి 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంతో చిరస్థాయిగా నిలిచిపోయే హిట్ ఇచ్చిన దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని డైరెక్ట్ చేస్తాడని.. నందమూరి తారక రామారావు ఫొటోస్ ని ప్లే చేస్తూ బాలయ్య తన వాయిస్ తో కూడిన ఒక వీడియో ద్వారా అధికారికముగా ప్రకటించాడు.
మరి బాలకృష్ణ అలా ఒక ప్రోమో తో డైరెక్టర్ క్రిష్ నే బయోపిక్ ని డైరెక్ట్ చేస్తున్నాడని చెప్పాడో లేదో.. ఇలా క్రిష్ లైన్ లో కొచ్చేశాడు. అంటే.. క్రిష్, బాలయ్య తన మీద పెట్టిన నమ్మకాన్ని మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తానని మాటిచ్చేశాడు. మరి క్రిష్ తన ట్విట్టర్ లో బాలయ్యకి కృతఙ్ఞతలు చెబుతూ... నన్ను నమ్మి ఇంత బాధ్యత నాకప్పగించిన బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. ఇది కేవలం ఒక సినిమా బాధ్యత కాదు. ప్రపంచంలోని తెలుగువాళ్లందరి అభిమానానికి, ఆత్మాభిమానానికి అద్దంపట్టే బాధ్యత. మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను.... అంటూ ట్వీట్ చేశాడు.
ఎన్టీఆర్ జయంతికి ఒకరోజు ముందే బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్ అని చెప్పి ఎన్టీఆర్ ఫాన్స్ కి పండగ వాతావరణం నింపేశాడు. మరి దర్శకుడు క్రిష్ తో బాలయ్య వచ్చే నెలాఖరు నుండి ఎన్టీఆర్ బయోపిక్ తో సెట్స్ మీదకెళ్తాడని తెలుస్తుంది. తేజ.. ఎన్టీఆర్ బయోపిక్ నుండి బయటికెళ్లిపోయాక.. ఆ దర్శకుడి ప్లేస్ లో చాలామంది పేర్లు వినబడ్డాయి. ఆఖరుకి బాలకృష్ణే ఈ ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలు భుజానికెత్తుకోబోతున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. కానీ చివరికి క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలను నెత్తినెట్టుకున్నాడు. ఇక అంతా క్రిష్ చూసుకుంటాడు కాబట్టి.. బాలయ్యకి ఈ ఎన్టీఆర్ బయోపిక్ భారం తగ్గినట్లే. ఇక ఈ ప్రాజెక్ట్ తేజ నుండి క్రిష్ చేతికొచ్చాక నందమూరి అభిమానులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.