త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ప్రతి చిత్రం ఎంతో పొయిటిక్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. 'నువ్వే నువ్వే' నుంచి 'అతడు, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి, జల్సా, అ..ఆ' వరకు అన్ని చిత్రాలు సకుటుంబంగా చూసేలా ఉంటాయి. ఆయనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేకగుర్తింపు ఉంది. దర్శకుడు కాకముందు కూడా 'నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు, స్వయంవరం' ఇలా ఆయన మాటల మాంత్రికునిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక మహేష్‌బాబు నటించిన 'ఖలేజా' చిత్రం కమర్షియల్‌గా హిట్ కాకపోయినా కూడా సీన్‌టు సీన్ బాగానే ఉంటుంది. దాంతో ఈ చిత్రం శాటిలైట్‌లో వచ్చినప్పుడు ప్రేక్షకులు బాగానే చూస్తూ ఉంటారు. కానీ 'అజ్ఞాతవాసి' చిత్రం మాత్రం త్రివిక్రమ్ పేరును అదఃపాతాళంలో పడేలా చేసింది. అసలు ఈ చిత్రాన్ని తీసింది త్రివిక్రమేనా అనే అనుమానం వచ్చేంతలా ఇది ఉండటం గమనార్హం.
తాజాగా ఈ చిత్రం గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ, ఓ రాజు.. ఓ రాజ్యం అంటూ సింపుల్‌గా ప్రజలకు చేరువయ్యేలా చెప్పాల్సిన కథను నేను బిజినెస్ పేజీలో మాత్రమే వచ్చే, అర్ధమయ్యే విధంగా కార్పొరేట్ స్టైల్‌లో చెప్పడం వల్లనే ప్రేక్షకులు తిరస్కరించారు. దాంతో ఎమోషన్స్ కూడా దారి తప్పాయి. దాంతో జనం ఆ చిత్రాన్ని తీసి పక్కన పడేశారు. ఈ చిత్రం నాకు గుణపాఠంగా మిగులుతుంది. ఈ చిత్రం డిజప్పాయింట్ చేసి నాకు జ్ఞానోదయం చేసిందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రం 90 కోట్ల బిజినెస్ చేస్తే 60కోట్లు రికవరీ అయ్యాయని, దాంతో నేను, పవన్‌కళ్యాణ్, నిర్మాత రాధాకృష్ణలు కలిసి బయ్యర్లకు 25కోట్లు తిరిగి ఇచ్చామని, మన వల్ల ఎవ్వరూ నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను.
ఇక నేను పవన్‌కి పొలిటికల్ స్పీచ్‌లు రాసి ఇస్తాననే విషయంలో నిజం లేదు. స్వయంగా ఆయన బాగా రాసుకోగలడు. ఓ పుస్తకాన్ని చదివినా కూడా ఆయన వెంటనే దాని అభిప్రాయాన్ని కాగితంపై రాసుకుంటారు. ఇక నాకు రాజకీయాలంటే పడవు అని చెబుతూ, 'అజ్ఞాతవాసి' కూడా 'ఖలేజా'లా టివిలలో ఆదరణ పొందతుందని చెప్పాడు. కానీ ఈ విషయంలో ఆయన మాటలు తప్పు. 'ఖలేజా' కనీసం సీన్‌టు సీన్ అయినా బాగుంది. కానీ 'అజ్ఞాతవాసి'లో అది కూడా లేదనేది వాస్తవం.