ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల్లో, ఏయన్నార్ సాంఘిక చిత్రాలతో ఊపు మీదున్న సమయంలో కత్తికాంతారావుగా పేరు తెచ్చుకున్న కాంతారావు జానపదకధా చిత్రాలలో తన సత్తా చాటుకున్నాడు. ఆయన జానపదకథా చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన కేవలం జానపదమే కాకుండా పౌరాణిక, సాంఘిక చిత్రాలలో కూడా తన హవా చాటాడు.
ఇక ఈయన తర్వాత తన కెరీర్‌లో నిర్మాతగా మారి ఆర్దికంగా బాగా నష్టపోయి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆయన బయోపిక్‌ని పీసీ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'అనగనగా ఓ రాకుమారుడు' టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో కాంతారావు జీవితంలోని విశేషాలను తెలుసుకునేందుకు దర్శకుడు పీసీ ఆదిత్య కాంతారావుకి చెందిన కోదాడ వద్దగల గుడిబండ వెళ్లి ఆయన సన్నిహితులను, ఆయన కుమారుడు ప్రతాప్‌ని కలిసి పలు విశేషాలను తెలుసుకున్నారు.
ఇక తమ చిత్రంలో ఎన్టీఆర్, ఏయన్నార్, విఠలాచార్య, రాజశ్రీ, కృష్ణకుమారి వంటి వారి పాత్రలు ఉంటాయని పీసీ ఆదిత్య స్పష్టం చేశారు. మరి ఇప్పటికే 'మహానటి', త్వరలో 'ఎన్టీఆర్', ఆ తర్వాత వీలుంటే లక్ష్మీస్ వీరగ్రంధం, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి బయోపిక్‌లు కూడా రూపొందే అవకాశాలున్నాయి.