ఒకవైపు దేశవ్యాప్తంగా బయోపిక్‌లకు వస్తున్న ఆదరణ.. మరోవైపు రాజ్‌కుమార్ హిరాణి వంటి దర్శకుడు కలిస్తే ఇక చెప్పేదేముంది? ఇప్పటికే 'మున్నాభాయ్ ఎంబిబిఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే' వంటి చిత్రాలను చూస్తే ఎవరికైనా నవ్వు, ఎమోషన్, మానవీయత, ఎవ్వరూ స్పృశించని సరికొత్త తరహా కథలు మన కళ్ల ముందు మెదులుతాయి. అలాంటి రాజ్‌కుమార్ హిరాణి ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్ జీవితంపై 'సంజు' అనే చిత్రం తీస్తున్నాడు. రణబీర్‌కపూర్ ఇందులో సంజయ్‌దత్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రాగా తాజాగా విడుదలైన ట్రైలర్ అదరహో అనే స్థాయిలో ఉంది.
సంజయ్‌దత్ జీవితం అంటే పోకిరి, డ్రగ్స్, హీరోయిన్లతో, అమ్మాయిలతో ఎఫైర్లు, అక్రమాయుధాల కేసులో జైలు జీవితం.. సినిమాలు ఇలా ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ హిరాణి అద్భుతంగా టచ్ చేశాడని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఇక సంజయ్‌దత్‌గా రణబీర్‌కపూర్ అదిరిపోయాడనే చెప్పాలి. ఆయన నటన, మేకప్, బాడీలాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ వంటి వన్నీ సంజయ్‌దత్‌ని దింపేసినట్లు అద్భుతమైన క్లాస్‌టచ్‌లో ఉన్నాయనే చెప్పాలి.
బయోపిక్ తీసేంత వెరైటీ లైఫ్ ఎవరికి దొరుకుతుంది చెప్పండి.?ఎందుకంటే నేనొక పోకిరిని, డ్రగ్స్‌కి అలవాటు పడిన వాడిని. కానీ ఉగ్రవాదిని మాత్రం కాదని హీరో చెప్పే డైలాగ్ ఎంతో బాగుంది. ఇక ఈ చిత్రంలో సంజయ్‌దత్ తండ్రి సునీల్‌దత్ పాత్రలో పరేష్‌రావల్, నర్గీస్ పాత్రలో టబు, రెండో భార్య మాన్యత పాత్రలో దియా మిర్జా వంటి వారు నటించారు. జూన్ 28న విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.