అతిలోక సుందరి శ్రీదేవి తన పెద్దకుమార్తె జాన్వికపూర్‌ని వెండితెరపై చూడాలని ఎంతో ముచ్చటపడింది. ఆమె తెరంగేట్రం కోసం ఎన్నింటినో కాదని, చివరకు మరాఠి చిత్రం 'సైరత్'కి బాలీవుడ్ రీమేక్‌గా రూపొందే 'దఢక్' చిత్రం ద్వారా జాన్వీని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నిర్ణయించి ఆ బాధ్యతను కరణ్‌జోహార్‌కి అప్పగించింది.
ఇక శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి విషయానికి వస్తే ఆమె ఎప్పుడు అమ్మకూచినే. అమ్మ చుట్టు తిరుగుతూ, అమ్మ మాట ప్రకారం నడుచుకోవడమే ఈమెకి తెలుసు. పలు ఇంటర్వ్యూలలో శ్రీదేవి సైతం తన అవసరం జాన్వికే ఎక్కువగా ఉందని, చిన్నకూతురు ఖుషీ తన నిర్ణయాలు తాను తీసుకోగలదని, మంచి ధైర్యవంతురాలని, కానీ జాన్వీ అలా కాదని చెప్పుకొచ్చింది. ఇక 'దఢక్' చిత్రానికి సంబంధించిన 25 నిమిషాల రష్‌ని మాత్రమే శ్రీదేవి చూసింది.
ఇక తాజాగా జాన్వి మాట్లాడుతూ, మా అమ్మ చివరి స్పర్శ నాకింకా బాగా జ్ఞాపకం. అమ్మ దుబాయ్‌కి పెళ్లికి వెళ్లేముందు రోజు నాకు షూటింగ్ ఉంది. కానీ ఆ రాత్రి సరిగా నిద్రపట్టలేదు. దాంతో అమ్మను నిద్రపుచ్చమని కోరాను. అమ్మ బట్టలు సర్దుకుంటూ బిజీగా ఉంది. కాసేపటి తర్వాత నేను మగత నిద్రలోకి జారుకున్నాను. అప్పుడు అమ్మ వచ్చి నా తల నిమిరి నన్ను పూర్తిగా నిద్రపుచ్చింది. అదే అమ్మతో నాకున్న చివరి స్పర్శ తాలూకు జ్ఞాపకం అంటూ ఎమోషన్‌కి గురైంది.
ఇక 'దఢక్' చిత్రం విడుదల సందర్భంగా యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. దీనిలో భాగంగా జాన్వి వోగ్ మేగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో జాన్వి శ్రీదేవికి సంబంధించిన తన చివరి స్పర్శ గురించి చెప్పుకొచ్చింది.