తెలుగులో మహిళా దర్శకురాళ్లు అంటే నిన్నటితరంలో సావిత్రి, భానుమతి వంటి వారు ఉన్నారు. ఆ తర్వాత విజయనిర్మల ఆ తర్వాత జీవిత రాజశేఖర్, నందినిరెడ్డి, బి.ఎ.జయ, మంజులా నాయుడు, శ్రీప్రియ, సుధా కొంగర వంటి వారిని గురించి చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే లిస్ట్‌లోకి సంజనారెడ్డి అనే దర్శకురాలు వచ్చి చేరింది. ఆమె దర్శకత్వం వహించగా, రాజ్‌తరుణ్ హీరోగా నటించిన 'రాజుగాడు' చిత్రం విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈమె తన విశేషాలను తెలియచూస్తూ.. మాది శ్రీకాకుళంలోని టెక్కలి నియోజకవర్గంలోని వమరవల్లి గ్రామం. డిగ్రీ వరకు అక్కడే చదివాను, మాది వ్యవసాయ కుటుంబం. మేము ఇద్దరం అమ్మాయిలం. చిన్నప్పటి నుంచి న్యూస్ తప్పితే సినిమాలు చూడలేదు. డిగ్రీ తర్వాత ఎంఎస్సీ మ్యాథ్స్‌ని ఆంధ్రా యూనివర్శిటీలో చేశాను.
వేసవి సెలవుల కోసం వైజాగ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాం. అప్పుడు 'ఖుషీ' చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని వైజాగ్‌లో 27సార్లు చూశాను. అదే సమయంలో విడుదలైన 'ప్రియమైన నీకు' చిత్రం ఏడు సార్లు చూశాను. 'ఖుషీ' చిత్రంలోని ప్రతి సీన్ నన్ను ఇన్‌స్పైర్ చేసింది. నాడు మేమంతా 'ఖుషీ'లోని పవన్ యాటిట్యూడ్‌తో ఉండేవారం. అంతలా ఆ చిత్రం నాపై ప్రభావం చూపింది. ఎమ్మెస్సీ పూర్తయిన తర్వాత ఇంటర్, డిగ్రీ విడ్యార్ధులకు లెక్చరర్‌గా మారి పాఠాలు చెప్పాను. ఆరునెలలు లెక్చరర్‌గా పనిచేసిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. సిటీలో మైక్రోసాఫ్ట్‌లో 8నెలలు పనిచేశాను. సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌గా ఉండటంతో సినిమాల మీద మోజుతో న్యూస్ రీడర్ కావాలని ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చాను.
జర్నలిస్ట్‌గా నా ప్రయాణం ప్రారంభమైంది. రెండేళ్లు మీడియాలో పనిచేశాను. ఎంతో మంది టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడంతో వారంటే భయం పోయింది. టాప్ డైరెక్టర్లు, హీరోలతో సరదాగా మాట్లాడేదానిని. అప్పుడు పూరీజగన్నాథ్ గారు దర్శకత్వం వైపు రాకూడదా? అన్నారు. అలా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'రౌడీ' చిత్రానికి దర్శకత్వ శాఖలో పదిరోజులు పనిచేశాను. ఓ యాడ్ చేయడంతో అమల గారితో పరిచయం కావడం, అది సక్సెస్ కావడంతో 'రాజుగాడు' కథను తయారు చేసుకుని దర్శకత్వం వహించాను అని చెప్పుకొచ్చింది.