ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. వైవిధ్యభరితమైన కథలను, మంచి ప్రయోగాత్మక చిత్రాలను, ఫీల్‌గుడ్ చిత్రాలను ఆదరిస్తున్నారు. రొటీన్ మూసకొట్టుడుగా ఉంటే ఎంత స్టార్ హీరో సినిమాకైనా చుక్కలు కనిపిస్తున్నాయి. అదే ఎంత చిన్న హీరో అయినా, కొత్త వారైనా సరే సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటే వాటికి క్యూ కడుతున్నారు. కానీ మన హీరోలలో కొందరు మాత్రం ఇంత స్పష్టంగా ప్రేక్షకుల వైఖరిలో మార్పు కనిపిస్తున్నా కూడా అవే మాస్ రోటీన్ చిత్రాలకేసి చూస్తున్నారు. ఫలితంగా 'టచ్‌చేసిచూడు, నేలటిక్కెట్' వంటి చిత్రాలు హిట్ అందుకోలేకుండా పోతున్నాయి.
మరోవైపు 'అర్జున్‌రెడ్డి, తొలిప్రేమ, ఛలో, భాగమతి, మహానటి, రంగస్థలం, భరత్ అనే నేను'లు విజయపధంగా దూసుకెళ్తున్నాయి. సాధారణ కంటెంట్‌తో కూడా భారీ కలెక్షన్లు వసూలు చేస్తాడనే పేరున్న అల్లుఅర్జున్‌కి కూడా 'నాపేరు సూర్య...నా ఇల్లు ఇండియా'తో చుక్కలు కనిపించాయి. ఇక తాజాగా విడుదలైన 'ఆఫీసర్, రాజుగాడు' చిత్రాల కంటే డబ్బింగ్ చిత్రంగా వచ్చిన విశాల్ 'అభిమన్యుడు'కే మంచి టాక్ వచ్చింది. 'బిచ్చగాడు' తర్వాత 'అభిమన్యుడు' టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఫలితాలే సాధిస్తోంది.
ఇక విషయానికి వస్తే తెలుగులో క్రియేటివ్ దర్శకుల లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన దర్శకుడి పేరు చంద్రశేఖర్ యేలేటి. 'ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, సాహసం, మనమంతా' ఇలా ఆయన ప్రతిచిత్రంలో ఏదో వెరైటీని ఖచ్చితంగా చూపిస్తాడు. ఈయన మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా మైత్రిమూవీమేకర్స్ బేనర్‌లో ఓ చిత్రం చేయాలని భావించాడు. మైత్రిమూవీస్ బేనరే ముందుకు వచ్చిందంటే సినిమాలో విషయం బాగానే ఉండి ఉంటుందని గట్టిగా చెప్పవచ్చు. కానీ ఈ చిత్రం కథలో హీరోయిజం లేదని ఇందులో నటించేందుకు సాయిధరమ్‌తేజ్, తర్వాత గోపీచంద్‌లు నో చెప్పారట. ఈ కథ అటు తిరిగి ఇటు తిరిగి నితిన్ చేతికి వచ్చిందని సమాచారం. ఇలాంటి పోకడల వల్లనే తేజుకి, గోపీచంద్, రవితేజ వంటి వారికి వరుస పరాజయాలు పలకరిస్తున్నాయని చెప్పాలి.