పాతకాలంలో మన హీరోలు కత్తి యుద్దాలు చేయాలన్నా, లేక చెట్లపై నుంచి దూకాలన్నా, చివరకు గుర్రం, కారు, బైక్ వంటివి స్పీడుగా నడపాలన్నా కూడా డూప్‌లే ఆ పనిచేసేవారు. ఎన్టీఆర్ నుంచి కృష్ణ వరకు ఇదే ట్రెండ్ నడిచింది. కానీ తదనంతరకాలంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి రిస్కీఫైట్స్‌ని కూడా తానే సొంతంగా చేసి ప్రేక్షకులకు థ్రిల్ కలిగించాడు. ఆయన మెగాస్టార్ కావడంలో రిస్కీషాట్స్‌లో డూప్ లేకుండా సహజంగా నటించడం, స్టెప్సు, ఫైట్స్‌లో కూడా తనదైన స్పీడు చూపించడంతో నాటి జనరేషన్స్ ఆయన మత్తులో పడిపోయాయి.
ఇక ఇప్పుడు సాంకేతికత మరింతగా పెరిగింది. ఏ హీరో డూప్ సాయంతో ఆ షాట్ చేశాడో సాధారణ ప్రేక్షకులు కూడా ఈజీగా కనిపెడుతున్నారు. కాబట్టి హీరోలు కూడా రిస్కీషాట్స్‌ని డూప్ లేకుండా తామే సొంతగా చేసేస్తున్నారు. 'సాహో' కోసం తాజాగా ప్రభాస్ ఛేజింగ్ సీన్లలో రఫ్ ఆడించాడని వార్తలు వస్తున్నాయి. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం మెగా హీరో వరుణ్‌తేజ్ 'ఫిదా, తొలిప్రేమ' వంటి రెండు క్లాస్‌హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన 'ఘాజీ ఎటాక్' దర్శకుడు సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో ఓ స్పేస్‌థ్రిల్లర్ చిత్రం చేస్తున్నాడు. బహుశా ఇండియాలో నిర్మితమైన మొదటి అంతరిక్ష చిత్రం ఇదే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో వ్యోమగామిగా నటించేందుకు విదేశాలలో వరుణ్‌తేజ్ ప్రత్యేక శిక్షణ పొందాడు. ఈ స్పేస్ థ్రిల్లర్ చిత్రంలో లావణ్యత్రిపాఠి, ఆదితీరావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అంతరిక్ష పరిశోధనకు చెందిన ఈ చిత్రం కోసం ఓ భారీ సెట్‌ని వేశారు. సహజత్వం కోసం ఆయన డూప్‌లేకుండా రిస్కీషాట్స్ చేసాడట. దీనికోసం యూనిట్‌లోని సభ్యులు వరుణ్‌తేజ్‌కి సంబంధించిన విషయాలలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయిన ఈ సీన్స్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. దీనికి సంబంధించిన గ్రాఫిక్ ఎఫెక్ట్స్ కూడా అద్బుతంగా ఉంటాయట. ఇక త్వరలో వరుణ్‌తేజ్.. వెంకటేష్‌తో కలిసి అనిల్‌రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న 'ఎఫ్ 2'(ఫన్ అండ్ ఫస్ట్రేషన్) చిత్రంలో కూడా నటించనున్నాడు.