తెలుగులో 'జబర్దస్త్' ద్వారా ఎంట్రీ ఇచ్చి, కమెడియన్‌గా ఇప్పుడు హీరోగా 'శంభోశివ, డ్రైవర్‌రాముడు' వంటి చిత్రాలలో నటిస్తున్న హీరో షకలక శంకర్. ఇక ఈయన ప్రస్తుతం మంచి అవకాశాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ఆయనను మీరు పవన్‌కళ్యాణ్‌తో కలిసి నటిస్తారా? అని ప్రశ్నిస్తే దానికి షకలక శంకర్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. పవన్ సీఎం కాబోతున్నాడు. మరి ఆయనతో నేను ఎలా నటించగలను? పవన్ కళ్యాణ్ సీఎం కావడమే కాదు పీఎం కూడా అవుతాడు. నేను పవన్‌కి వీరాభిమానిని. పవన్ ప్రజల్లోకి వెళ్లేటప్పుడు ఆయన మెడలో ఓ ఎర్రని టవల్ ఉంటుంది. అది కేవలం రెడ్ టవల్‌కాదు. అది విప్లవానికి సంకేతం, ఆ టవల్ ఉంటే విజయం ఖాయం.
అదే విజయానికి సగంబలం అని చెప్పిన షకలక శంకర్ తాను కూడా అలాంటి టవల్‌నే వాడుతానని చెప్పుకొచ్చాడు. బహుశా సప్తగిరి చిత్రాలకు పవన్ ప్రమోషన్స్ చేసినట్లే తన చిత్రాలకు కూడా పవన్ ప్రమోషన్ చేయాలనేది షకలక శంకర్ ఉద్దేశం కాబోలు. అందుకే ఆయన పవన్‌ని సీఎం, పీఎం అని ఆకాశానికి ఎత్తేశాడు. ఇక పవన్ ఒకవైపు రాజకీయాలు, యాత్రల్లో బిజీగా ఉంటూనే పలు సినిమా వేడుకలకు వరుసగా హాజరవుతున్నాడు. 'రంగస్థలం' చిత్రం పెద్ద హిట్ అయిన తర్వాత ఆయన చిన్నగా ఈ చిత్రం సక్సెస్‌మీట్‌కి వచ్చాడు.
కానీ అప్పటికే 'రంగస్థలం' తన హవా చూపించింది కాబట్టి పెద్దగా పవన్ వల్ల ఉపయోగం లేకుండా పోయింది. బన్నీ 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' వేడుకకు వచ్చినప్పటికీ ఆ చిత్రానికి కలెక్షన్లు ఏమీ పెరగలేదు. ఇక తన సొంత చిత్రం 'ఛల్ మోహన్ రంగ, నేలటిక్కెట్' చిత్రాలకు గెస్ట్‌గా వచ్చినా కూడా రెండు బోల్తా కొట్టాయి. దాంతో పవన్‌ని ప్రమోషన్ కోసం వాడుకోవాలనుకుంటున్న షకలక శంకర్ వంటి వారికి పవన్ ప్రమోషన్ వల్ల అదనంగా చేకూరే లాభం లేదని చెప్పవచ్చు.