రాంగోపాల్‌వర్మ... ఈయనలో సత్తా పోయి చాలా కాలమైందని ఇటీవల నాగార్జున హీరోగా ఆయన తీసిన 'ఆఫీసర్'ని చూస్తే తెలుస్తుంది. రెండో రోజు నుంచే ఈచిత్రం విడుదలైన అన్నిథియేటర్లు ఖాళీ అయ్యాయి. ఎంతని మన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్స్ భరిస్తారు? చెప్పండి. దాంతో ఆ చిత్రాన్ని సోమవారం నుంచే తీసివేసి అదే రోజున విడుదలైన డబ్బింగ్ చిత్రం, విశాల్, సమంతల 'అభిమన్యుడు'ని వేశారు. నాగార్జున కెరీర్‌లోనే ఇంత దీనస్థితి ఏ చిత్రానికి ఎదురు కాలేదనే చెప్పాలి. ఇక వర్మ కేవలం వెబ్‌సిరీస్‌లు తీసుకోవాల్సిందేనని, లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా వర్మ మరో సినిమాకి నిర్మాతను పట్టాడు. గతంలో వర్మ తీసిన 'సర్కార్', ఎటాక్స్ ఆఫ్ 26/11 చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన పరాగ్ సంఘ్వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఈ చిత్రం టైటిల్ 'వైరస్', ప్రపంచంలో ఎన్నో అంటు వ్యాధులు వస్తున్నాయి. నిబోలా నుంచి నిపా వరకు ఎన్నో ప్రపంచాలను, దేశాన్ని భయపెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇలాంటి వైరస్‌లు ఎక్కువగా ఆఫ్రికా నుంచి దిగుమతి అవుతున్నాయని బయోసైంటిస్ట్‌లు చెబుతుంటారు. ఇదే పాయింట్‌ని వర్మ తన సినిమాకి కథా వస్తువుగా తీసుకున్నాడు. ముంబైకి చెందిన ఓ యువకుడు ఆఫ్రికా వెళ్తాడు. అక్కడి నుంచి ముంబై తిరిగి వచ్చిన తర్వాత ఆయన భయంకరమైన అంటు వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ఈ వ్యాధి రెండు కోట్లు జనాభా ఉండే ముంబై నగరం మొత్తం దావానలంలా వ్యాపిస్తుంది. ప్రభుత్వం రద్దీగా ఉండే ముంబైలో మనిషికి మనిషికి మధ్య 20 అడుగుల దూరం పాటించాలని ఆచరణ సాధ్యం కాని హెచ్చరిక చేస్తుంది. ఈ వ్యాధి నుంచి తప్పించుకోలేక ప్రజలు, ఆ వ్యాధి నుంచి ప్రజలను కాపాడలేక ప్రభుత్వం సతమతమవుతాయి.
ఇదే పాయింట్‌ని వర్మ భయం, బాధ, ఆవేదన, ప్రేమ, త్యాగం, ఆశనిరాశల వంటి పలు మానవీయకోణాలలో తీయనున్నాడని, ఇందుకు సంబంధించి వర్మ ఎబోలా వైరస్ వంటి వాటి గురించి అధ్యయనం చేసే పనిలో ఉన్నాడని నిర్మాత పరాగ్‌సంఘ్వి తెలిపాడు. మొత్తానికి ఈ పాయింట్‌ని చూస్తే వర్మ తనకు తగ్గ కధా వస్తువునే ఎంచుకున్నాడనే నమ్మకం కలుగుతోంది.