ఇప్పటి వరకు బాలీవుడ్ స్ట్రెయిట్ చిత్రాలలో నటించకపోయినా కూడా 'బాహుబలి' చిత్రంతో రాజమౌళి, ప్రభాస్, రానా, సత్యరాజ్, రమ్యకృష్ణల తర్వాత అంతటి పేరును దేశవ్యాప్తంగా తెచ్చుకున్న నటి అనుష్కశెట్టి అలియాస్ స్వీటీ. ఈమధ్య ఈమె 'సైజ్‌జీరో' కోసం బాగా లావుగా తయారై ఆ తర్వాత సన్నబడేందుకు ఎంతో కష్టపడుతోంది. లావుగా ఉన్నప్పటికీ గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌లకు కోట్లు ఖర్చు చేసి 'బాహుబలి'లో దేవసేనగా 'భాగమతి' చిత్రాలలో కూడా దర్శకులు ఆమెని నాజూకుగా చూపించే ప్రయత్నం చేశారు. ఇది బాగానే వర్కౌట్ అయింది. 'బాహుబలి, భాగమతి' చిత్రాలు ఈమెకి మంచి పేరును తెచ్చాయి. అయితే ఆమె నటించగా, విడుదలైన చివరి చిత్రం 'భాగమతి' బాహుబలి సమయంలో ఒప్పుకున్న చిత్రమే. ఆ తర్వాత అనుష్క ఇప్పటి వరకు మరో చిత్రంలో నటించలేదు.
తాజాగా ఆమె గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రం, అలాగే మరో తెలుగు చిత్రం ఒప్పుకుందని తెలుస్తోంది. తాజాగా ఈమె బాహుబలి చిత్రంలో దేశవ్యాప్త గుర్తింపును తెచ్చుకోవడంతో జాతీయ మీడియా కూడా ఈమెపై ఆసక్తిని ప్రదర్శిస్తోంది. ఓ జాతీయ మీడియా రాసిన దాని ప్రకారం అందాల తార అనుష్క త్వరలో పెళ్లికూతురు కానుందనే వార్త వైరల్ అవుతోంది. ఈ ఏడాది చివరలో ఆమె పెళ్లి ఉండనుందని ఆ కథనంలో పేర్కొన్నారు. అందులో భాగంగానే ఆమె పలు ఆలయాలను సందర్శిస్తూ పూజలు చేస్తోందని రాసుకొచ్చింది. ఆమె తల్లిదండ్రులు సరైన వరుడి కోసం చూస్తున్నారని, దాని కోసం వారు పలు ప్రొఫైల్స్ పరిశీలిస్తున్నారని ఆ కథనంలో వ్యాఖ్యానించారు. అనుష్కకి నచ్చిన వరుడు దొరికితే వెంటనే పెళ్లి పనులు మొదలవుతాయని తెలిపింది.
ఇక అనుష్కకి ప్రభాస్‌తో పెళ్లి జరగనుందని వారిద్దరు ఎంత ఖండించానా వార్తలు మాత్రం ఆగడంలేదు. ఇటీవల 'సాహో' చిత్రం కోసం ప్రభాస్ రిస్కీ ఫైట్లు చేస్తున్నాడని తెలిసి స్వయంగా అనుష్క షూటింగ్ ప్రదేశానికి వెళ్లి రిస్కీ ఫైట్లను సొంతంగా చేయవద్దని ప్రభాస్‌కి నచ్చజెప్పినట్లు కూడా పలు మీడియాలలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి చివరికి ఈ స్వీటీని పెళ్లాడే అదృష్టవంతుడు ఎవరో వేచిచూడాల్సివుంది.