సినిమా పరిశ్రమలో ఒక హీరో కోసం రాసుకున్న కథలు వేరే హీరోల వద్దకు చేరడం సహజమే. పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, రవితేజ వంటి ఎందరో పక్కవారి ప్రాజెక్ట్స్‌ని దక్కించుకుని, తమకు వచ్చిన హిట్ చిత్రాలను వదిలేసుకున్న వారు ఉన్నారు. ఇదంతా అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని కొందరు అంటే.. కాదు కథలను జడ్జ్ చేయడం మీద ఆధారపడి ఉంటుందని మరికొందరు అంటారు. తినే ప్రతి బియ్యపు గింజ మీద దేవుడు ఆ మెతుకు ఎవరు తినాలో రాసినట్లే, ప్రతి కథ వెనుక దానిని ఏ హీరో చేయాలో రాసి ఉంటుందని అంటారు.
ఇక విషయానికి వస్తే మహేష్‌బావ, సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్‌బాబుకి ఇప్పటివరకు తెలుగులో 'ప్రేమకధా చిత్రమ్' తప్ప మరో హిట్ లేదు. 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, భలే మంచిరోజు'లు ఫర్వాలేదనిపించాయి. ఇక ఇప్పుడు ఈయన టాలెంటెడ్ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'సమ్మోహనం' అనే చిత్రం చేశాడు. ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్‌లో సుధీర్‌బాబు మాట్లాడుతూ, నా మొదటి చిత్రం 'ఎస్‌ఎంఎస్' విడుదలకు వారం ముందు నేను ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి ఒప్పుకున్నాను. ఈ చిత్రానికి కథను నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఇచ్చాడు. నిర్మాతలు కూడా కుదిరారు. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
దాంతో అదే కథకు కాస్త మార్పులు చేర్పులు చేసి శ్రీనివాస్ అవసరాలనే దర్శకత్వం వహిస్తూ ఆ చిత్రాన్ని తీశాడు. ఆ చిత్రమే 'ఊహలు గుసగుసలాడే'. ఇందులో నాగశౌర్య-రాశిఖన్నాలు నటించారు. ఈ చిత్రం సూపర్‌హిట్ అయింది. అలా నాకు ఓ మంచి హిట్ చిత్రం మిస్సయిందని చెప్పుకొచ్చాడు. మరి 'సమ్మోహనం' చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సివుంది!