గత ఏడాది ఆగష్టు లో ప్రెస్టేజ్ కోసమో.. తమ సినిమాల మీదున్న నమ్మకంతోనే.. ఒకే డేట్ కి మూడు సినిమాలు విడుదలై ప్రేక్షకులను జడిపించేసాయి. ఆగష్టు 11 న తమ సినిమాలు విడుదల చేసి ఆ వారంలో వచ్చిన ఆగష్టు 15 ను సెలవల్ని క్యాష్ చేసుకోవాలని చూసిన ఒకరిద్దరి నిర్మాతల చేతులు కూడా కాలాయి. ఇక ఆగష్టు 11 న పోటీగా రానా దగ్గుబాటి - తేజ లు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో వస్తే... నితిన్ - హను రాఘవపూడి లు లై సినిమాతో వచ్చారు. ఇక మాస్ డైరెక్టర్ బోయపాటి - బెల్లంకొండ శ్రీనివాస్ లు జయ జానకి నాయక సినిమాతో రాగా.. అందులో నేనే రాజు నేనే మంత్రి సినిమా హిట్ అయ్యింది. ఇక నితిన్ లై డిజాస్టర్ కాగా... జయ జానకి నాయక ముక్కుతూ మూలుగుతూ గట్టెక్కింది. మరి మూడు సినిమాలు ఒక వారం గ్యాప్ లో విడుదలై ఉంటే గనక ఖచ్చితంగా హిట్ అయ్యేవి. కానీ ఎవరికీ వారు ఈగోలకు పోయి తమ సినిమాల్తో ప్రేక్షకులను బెంబేలెత్తించారు.
అయితే ఈసారి ఆగష్టు అంత రసవత్తరంగా అనిపించడం లేదు. ఏ హీరో కూడా ఆగష్టు కు వస్తున్న దాఖలాలు కనబడటం లేదు.. ఒక్క నితిన్ తప్ప. నితిన్ - రాశి ఖన్నాల శ్రీనివాస కళ్యాణం మాత్రం నిర్మాత దిల్ రాజు ఆగష్టు తొమ్మిదిన ఫిక్స్ చేసాడు. మరి గత ఆగష్టు లో హిట్ కొట్టలేని నితిన్ ఈసారికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో అంటే శ్రీనివాస కల్యాణంతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీనివాస కళ్యాణం సినిమా కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంపై నితిన్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఎందుకంటే గత సినిమాలు రెండు నితిన్ కి హిట్ ఇవ్వలేకపోయాయి. లై సినిమా డిజాస్టర్ కాగా... చల్ మోహన రంగా సో సో గా ఆడింది.
ఇక నాగ చైతన్య - చందు మొండేటిలా సవ్యసాచి సినిమా కూడా ఆగష్టు బరిలో ఉంది. కానీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు. మరి షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకున్న నాగ చైతన్య సవ్యసాచి వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఆగష్టు కి వెళ్ళిపోయింది. మరి నాగ చైతన్య సవ్యసాచి ఆగష్టు లో ఏ తేదీని ఫిక్స్ చేసుకుంటుందో అనేది ఇంకా క్లారిటీ లేదు. ఏది ఏమైనా గత ఆగష్టు లో ఉన్న రసవత్తర పోటీ ఈసారి ఈ ఆగష్టులో లేదనేది వాస్తవం.