ప్రస్తుతం దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్ ఎవరు అంటే ఠక్కున నయనతార పేరే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఆమె ఓ చిత్రంలో నటించిందంటే హీరో ఎవరనేది కూడా చూడకుండా థియేటర్ల ముందు ప్రేక్షకులు క్యూ కడతారు. అంతగా పాపులారీటీ సంపాదించుకుంది ఈ కేరళ కుట్టి. 'చంద్రముఖి' నుంచి వయసు పెరిగే కొద్దీ ఈమె క్రేజ్‌ను కూడా పెంచుకుంటూ పోతోంది. ఇలా ఇన్నేళ్లు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిపోవడం అంటే మాటలు కాదు. మరోవైపు ఆమెకి ప్రభుదేవా, శింబులతో ఎఫైర్స్ ఉన్నాయని అనేక ఆధారాలు బయటికి వచ్చాయి. పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయాయి. సాధారణంగా మరో హీరోయిన్ అయితే ఈ పరిస్థితుల్లో ఫేడవుట్ అవుతుంది. కానీ ఈమె మాత్రం దూసుకుని పోతోంది. మరోవైపు ఆమెని మోసం చేశారని చెప్పుకునే ప్రభుదేవా, శింబుల కెరీర్లు మాత్రం పడిపోయాయి.
ఇక ఈమెకి తమిళ దర్శకుడు విఘ్నేష్‌శివన్‌తో వివాహం జరిగిందని, వారిద్దరు ఒకే ఫ్లాట్‌లో ఉంటున్నారని కూడా కోలీవుడ్ మీడియా అంటోంది. కానీ ఇలాంటి అవరోధాలన్నింటిని ఛేదించుకుని ఆమె ఇప్పటికీ కోలీవుడ్‌లో నెంబర్1 నుంచి నెంబర్ 10వరకు అన్ని తానేనని నిరూపిస్తోంది. ఈమె ప్రమోషన్లకు కూడా రాదు. కానీ ఫిల్మ్‌మేకర్స్ మాత్రం ఆమె ప్రమోషన్స్‌కి రాకపోయినా ఫర్వాలేదు.. పోస్టర్‌పై ఆమె బొమ్మ కనిపించాలని కోరుకుంటున్నారు. కొత్తగా వచ్చిన యంగ్ హీరోల నుంచి సీనియర్ స్టార్స్ వరకు అందరి చూపు ఈమె మీదనే. ఇక ఈమె తెలుగులో చిరంజీవి నటిస్తున్న 'సై..రా...నరసింహారెడ్డి'లో హీరోయిన్గా నటిస్తోంది. ఈమధ్య ఈమె హీరోలను వెండితెరపై కూడా తన చేతిని కూడా తాకనివ్వడం లేదు. రొమాన్స్‌కి నో చెబుతోంది.
మరోవైపు లేడీ ఓరియంటెడ్ పాత్రలను ఎక్కువగా చేస్తోంది. ఈమె నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ చిత్రంలో ఓ స్టన్నింగ్ సర్ప్రైజ్ కూడా ఉందట. ఇది ఉమెన్ బేస్డ్ లేడీ సెంట్రిక్ మూవీ అని తెలుస్తోంది. గతంలో మణిరత్నం, మురుగదాస్‌ల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన కె.ఎమ్. సర్జున్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ షార్ట్ ఫిల్మ్స్ లక్ష్మీ, మా అనే వాటికి ఇతనే దర్శకుడు. ఇక ఇటీవల నయనతార ప్రధాన పాత్ర పోషించిన 'అరమ్' చిత్రాన్ని నిర్మించిన ఎజెఆర్ స్టూడియో సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండటం విశేషం.