ఏ ముహూర్తాన త్రిష ఎంగేజ్‌మెంట్ రద్దయిందో గానీ ఆ తర్వాత ఆమెకి తమిళంలో వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఇందులో మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు... అరవింద్ స్వామి నుంచి విక్రమ్ వరకు ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. అందులోనూ ఆమె 'సామి'తో పాటు కొన్ని చిత్రాలలో అవకాశాలను వదిలేసుకుంది. తెలుగు, తమిళంలో ఈమె చిరంజీవి నుంచి మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ వరకు, అలాగే తమిళంలో కూడా సీనియర్ స్టార్స్ నుంచి యంగ్ స్టార్స్ సరసన కూడా చేస్తూ దాదాపు ఒకటిన్నర దశాబ్దం నుంచి తన కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉంది.
ఇటీవల కాలంలో ఈమెకి తమిళంలో అవకాశాలు రావడమే కాదు... తొట్ట తొలిసారిగా మలయాళంలో కూడా అవకాశం లభించింది. తమిళ చిత్రాల అనువాదాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నా కూడా తెలుగులో నేరుగా అవకాశాలు మాత్రం తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈమెకి తెలుగులో ఓ మంచి అవకాశం తలుపు తట్టింది. 'శతమానంభవతి' ద్వారా అవార్డులు, రివార్డులు కూడా గెలుచుకున్న దర్శకుడు సతీష్ వేగ్నేష్ ప్రస్తుతం దిల్‌రాజు బేనర్‌లో నితిన్, రాశిఖన్నా జంటగా 'శ్రీనివాసకళ్యాణం' చిత్రం తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత ఆయన ఓ లేడీ ఓరియంటెండ్ సబ్జెక్ట్‌ని రెడీ చేసుకున్నాడు. ఈ చిత్రం కథ మొత్తం తన చుట్టూ తిరిగే కథ కావడంతో త్రిష కూడా దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఎంతో కాలంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ప్రముఖ నిర్మాత కె.ఎల్.నారాయణ ఈ చిత్రానికి నిర్మాత అని తెలుస్తోంది. ఈయనకు రాజమౌళితో కూడా కమిట్‌మెంట్ ఉంది. రాజమౌళి చిత్రం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండటంతో ఆ లోపు ఆయన ఓ లోబడ్జెట్‌లో తెలుగుతో పాటు తమిళంలో కూడా వర్కౌట్ అయ్యేలా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని సమాచారం.