తాజాగా తన కారులోంచి కొంత చెత్తను రోడ్డుపైకి విసిరేసిన ఓ కారులోని వ్యక్తిని అనుష్కశర్మ చెడామడా తిట్టిన సంగతి తెలిసిందే. దీనిని ఆమె భర్త విరాట్‌కోహ్లి వీడియోలో బంధించి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయంలో చెత్తను రోడ్డు మీద పారబోసి అనుష్కశర్మ చేత తిట్లు తిన్న అర్హాన్‌ఖాన్ వ్యాపారవేత్తేకాదు బాలనటుడిగా కూడా చేశాడు. ఆయన అనుష్కపై విరుచుకుపడుతూ, నేను రోడ్డు మీద వేసిన చెత్త కన్నా అనుష్క నోటి నుంచి వచ్చిన చెత్త ఎక్కువ అంటూ, తాను చేసింది తప్పేనని, కానీ పబ్లిసిటీ కోసం వెంపర్లాడే అనుష్క, విరాట్‌ల కంటే తానే బెటరని వ్యాఖ్యానించాడు.
ఈ విషయంలో కొందరు అనుష్క, విరాట్‌లకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు అర్హాన్‌ఖాన్‌ని వెనకేసుకుని వస్తున్నారు. రోడ్డు మీద చెత్త సంగతి సరే. మైదానంలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే నీ భర్తకి ముందు బుద్దిగా ఉండమని చెప్పాలని అనుష్కపై పలువురు మండిపడుతున్నారు. ఇక అర్హాన్‌ఖాన్ విషయానికి వస్తే 1996లో వచ్చిన 'ఇంగ్లీషుబాబుదేసీ మేమ్' చిత్రంలో ఆయన బాలనటునిగా నటించాడు. ఇందులో షారుఖ్‌ఖాన్, సోనాలి బింద్రే జంటగా నటించారు.
ఇప్పుడు సోషల్‌మీడియా నిండా తన పేరు మారుమోగుతుండటంలో అర్హాన్‌ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో షారుఖ్‌ఖాన్‌తో కలిసి పనిచేయడం ఎంతచక్కని అనుభవమో అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. మాధురీ దీక్షిత్ నటించిన 'రాజా', షాహిద్‌కపూర్ నటించిన పాఠశాల చిత్రాలలో ఈయన చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఇక అర్హాన్‌ఖాన్ షారుఖ్ చిత్రంలో బాలనటునిగా నటించగా, ప్రస్తుతం అనుష్కశర్మ షారుఖ్‌ఖాన్‌తో కలిసి 'జీరో' చిత్రంలో నటిస్తూ ఉండటం విశేషంగా చెప్పాలి.