జనసేనాధిపతి అన్ని తానై చేస్తున్న పోరాటయాత్రను రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రేక్ ఇచ్చాడు. విశాఖ పర్యటనకు బ్రేక్ ఇచ్చిన ఆయన రంజాన్ గడిచి మూడు నాలుగు రోజులైనప్పటికీ తన పర్యటనకు సంబంధించిన వివరాలు బయటకు రాకపోవడంతో పవన్‌కి ఏమైంది? ఆయన పర్యటన విషయంలో ఇంకా స్పష్టత ఎందుకు రాలేదు? వంటి విషయాలు ప్రజల మనసుల్లో రేగుతున్నాయి. వాస్తవానికి ఈ గ్యాప్‌లో ఆయన ఈనెల 24వ తేదీన తన కంటికి శస్త్రచికిత్స చేయించుకోవాలని భావించారు. కానీ దీనిని డాక్టర్లు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
దీంతో ఈనెల 26వ తేదీ నుంచి పవన్ మరోసారి తన యాత్రను ప్రారంభించనున్నాడు. మొదట ఆయన విశాఖలో మిగిలి ఉన్న నియోజకవర్గాలలో తన యాత్రను పూర్తి చేస్తాడు. అనంతరం ఉత్తరాంధ్ర మేధావులతో ఆయన పలు దఫాలు చర్చిస్తారు. ఆ వెంటనే ఆయన యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. విశాఖలో మూడు నాలుగు రోజుల పర్యటన తర్వాత ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఎంటరై యాత్ర జరపునున్న నేపధ్యంలో పార్టీశ్రేణులు ఈ పర్యటనకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. గత యాత్రలో కేవలం సింగిల్ పాయింట్ ఎజెండాగా కేవలం టిడిపి హఠావో అనే నినాదంతోనే బరిలోకి దిగిన పవన్ ఈసారి ఎలాంటి అస్త్రశస్త్రాలను తయారుచేసుకోనున్నాడు? అనే విషయం ఆసక్తిని రేపుతోంది.
ప్రతి దానికి కేవలం టిడిపినే కారణమన్నట్లుగా ఆయన ఒకే బాటలో నడుస్తుండటం వల్ల ఆయనకు రాజకీయ అవగాహనా రాహిత్యం ఉందని పలువురు భావిస్తున్నారు. అలాకాక కేవలం టిడిపినే టార్గెట్ చేయకుండా టిడిపి, వైసీపీ, బిజెపి అన్నింటిని అంశాల వారీగా విమర్శిస్తే ఆయన మాటలకు కాస్త విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరి పవన్ అందరినీ వారి వారి తప్పొప్పులను బేరీజు వేసి విమర్శిస్తారా? లేక మరలా సింగిల్ ఎజెండా టైప్‌లో టిడిపినే నిందుస్తూ వెళ్తాడా? అనేది వేచిచూడాల్సివుంది...!