సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒక హీరో కోసం అనుకున్న చిత్రాలు వేరొకరికి వెళ్లిపోతూ ఉంటాయి. ఆయా చిత్రాలు సాధించే జయాపజయాలను బట్టి ఆయా హీరోల జడ్జిమెంట్ తెలిసిపోతుంది. ఆయా హీరోలు ఒప్పుకోకపోవడం వల్ల పలు హిట్ చిత్రాలు ఇతర హీరోల ఖాతాలోకి పోవడం సహజంగా జరిగే పరిణామం. పవన్‌కళ్యాణ్ వదిలేసిన చిత్రాలతోనే మాస్ మహారాజా రవితేజ కెరీర్ టర్న్ అయింది. ఇక పవన్, మహేష్, ఎన్టీఆర్ వంటి ఎందరో కొన్ని చిత్రాలు రిజెక్ట్ చేయడం, అవి వేరేవారి చేతుల్లోకి వెళ్లడం కామన్. అందుకే తినే ప్రతి అన్నపు ముద్ద మీద తినే వాడి పేరు రాసి ఉన్నట్లే... ప్రతి పాత్ర మీదా ఆయా హీరోల పేరు రాసి ఉంటుందని అంటారు. ఇక కొన్ని చిత్రాలను కేవలం హిట్ కోణంలో చూడకుండా చేయాలని భావించినా కూడా కాల్షీట్స్ ప్రాబ్లం వల్ల అవి వేరేవారికి వెళ్లే చాన్స్‌లు కూడా వస్తూ ఉంటాయి.
ఇక తాజాగా విషయానికి వస్తే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్‌బాబు, ఆదితీరావు హైదరిలు నటించిన 'సమ్మోహనం' చిత్రం మొదటి షో తోనే యునానిమస్‌గా హిట్ టాక్ సొంతం చేసుకుంది. సుధీర్‌బాబుకి ఓవర్‌సీస్‌లో పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడం, రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఆయన క్రేజ్ అంతంత మాత్రమే. దానివల్ల ఈ చిత్రానికి లభించిన టాక్‌కి తగ్గట్లు కలెక్షన్లు రావడం లేదు. అసలు ఇలాంటి చిత్రం ఓవర్‌సీస్‌లో రెండు మిలియన్లను కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదు. కానీ అక్కడ దీనిని హాఫ్ మిలియన్ వసూళ్లు మాత్రమ వచ్చాయి.
ఈ చిత్రం స్టోరీని మొదట ఇంద్రగంటి.. నాగచైతన్యకి వినిపించాడట. దీనితో పాటు మరో రెండు మూడు స్టోరీలైన్స్ ఆయనకు ఇంద్రగంటి వినిపించినప్పటికీ నాగచైతన్య మాత్రం చేస్తానని కానీ చేయనని గానీ చెప్పలేదని తెలుస్తోంది. మరోవైపు ఆయన 'సవ్యసాచి'తో పాటు 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రాల బిజీలో ఉండటం వల్ల కూడా ఆయన ఈ చిత్రాన్ని వదిలేసుకున్నాడని అంటున్నారు. ఏదిఏమైనా నాగచైతన్య ఈ చిత్రం ఒప్పుకుని ఉంటే సినిమాకి మరింత మైలేజ్ వచ్చి ఉండటమే కాదు.. చైతూకి ఇంద్రగంటికి కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా నిలిచి ఉండేదనేది మాత్రం వాస్తవం.