నేటిరోజుల్లో పరిపక్వత చెందిన హీరోల అభిమానుల కంటే కరడుగట్టిన వీరాభిమానులు ఎక్కువగా తయారవుతున్నారు. వారికి రియల్‌లైఫ్‌కి, రీల్‌లైఫ్‌కి తేడా తెలియదు. ఉన్మాదం పట్టిన టెర్రరిస్ట్‌ల కంటే భయంకరంగా మారుతున్నారు. ఈ విషయంలో ఆయా హీరోల తప్పు కూడా ఉంది. ఎన్ని తప్పులు చేసినా వారు అభిమానులను వారించడం గానీ, అలా చేయడం తప్పు అని గాని చెప్పరు. దాంతో హీరోలు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నా కూడా వారి అభిమానులు మాత్రం ఇతరులను రెచ్చగొట్టడానికి, తమ హీరో కంటే తమ హీరో గొప్ప అని చంపుకునేంతగా మారిపోతున్నారు. వీరిలో మెగాభిమానులు కూడా తక్కువేమీ తినలేదు.
ఇక విషయానికి వస్తే కొంతకాలం కిందటే తనకి ఓ తోడు కావాలని, పిల్లలకు ఓ అండ కావాలని ఆశిస్తున్నట్లు పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది. నాటి నుంచి ఆమె రెండో పెళ్లి జరగనుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈమె మరో వ్యక్తితో కలిసి నిశ్చితార్ధం కూడా చేసుకుంది. కానీ ఆమె నిశ్చితార్ధంకి చెందిన ఫొటోను పోస్ట్ చేసినా అందులో తనకు కాబోయే భర్త కనిపించకుండా జాగ్రత్త పడింది. దీనికి కారణం గతంలో రేణుదేశాయ్ మరో వివాహం చేసుకోవాలని ఉందని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పిన వెంటనే కొందరు పవన్ వీరాభిమానులు ఊగిపోయారు. మీరు ఎవ్వరినీ చేసుకోవడానికి వీలు లేదు. అలా చేస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని భావించిన వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాం అని బెదిరించారు. ఈ విషయంపై మీడియాలో పలు వార్తలు రావడమే కాదు.. ఆ తర్వాత రేణుదేశాయ్ సైతం ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
ఇక తాజాగా కూడా పవన్ అభిమానుల్లో మూడు వాదనలు వినిపిస్తున్నాయి. పెళ్లి చేసుకుంటే ఒప్పుకోమని భయం పుట్టించే వారు కొందరైతే, ఆమె రెండో వివాహాన్ని ఎంతో సహృదయంతో స్వీకరిస్తున్న విజ్ఞులు కూడా ఉన్నారు. వారు ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరు అంతా జరిగినా తన కాబోయే భర్తని ఆమె ఎందుకు దాచి ఉంచుతోంది? తన తప్పు లేకపోతే ఎందుకు భయపడుతుంది? అని వాదించే వారు కూడా ఉన్నారు. మొత్తానికి పవన్ వీరాభిమానుల భయంతోనే రేణు తనకు కాబోయే భర్తని ఎవ్వరికీ పరిచయం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారం.