అనుకున్నామని జరగవు అన్ని.. అనుకోలేదని ఆగవు కొన్ని అని ఓ కవి చెప్పుకొచ్చాడు. ఇక దేవునిపై నమ్మకంలేని నాస్తికుల విషయం పక్కనపెడితే భగవంతుని నమ్మే వారు మన దేశంలో ఎక్కువగా కర్మ సిద్దాంతాన్ని అనుసరిస్తారు. ఏది జరిగినా, అనుకున్నది జరగకపోయినా కూడా అంతా మన మంచికే అనుకుంటారు. కంగనారౌనత్ మనసు కూడా అలాంటిదే అని ఆమె తాజా మాటలను బట్టి అర్ధమవుతోంది.
ఆమె మాట్లాడుతూ.. నేను పెళ్లి చేసుకోవాలని చాలా సార్లు అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా కాకపోవడమే అదృష్టంగా భావిస్తున్నాను. నా ప్రేమ విఫలం కావడానికి కూడా ఆదేవుని ఆశీస్సులే కారణమని నమ్ముతున్నాను. నేను ఏది కావాలని కోరుకున్నా వాటిని భగవంతుడు ప్రసాదించలేదు. కానీ అలా ఆయన నేను అనుకున్న అన్ని విషయాలను నెరవేర్చకపోవడమే మంచిదైందని ఇప్పుడు అనిపిస్తోంది. మోడల్ కావాలని భావించాను. కాలేకపోయాను. అది కూడా నా మంచికే జరిగింది. నేను కోరుకున్నవి నాకు నెరవేరనప్పుడు బాధపడ్డాను. ఎంతో ఏడ్చాను.
కానీ నాకు ఏమీ తెలియని కోరికలనే నేను కోరుకున్నానని, నాకేమీ తెలియదని అందుకే దేవుడు వాటిని నెరవేర్చకుండా మంచి పని చేశాడని తెలుసుకుని, ఇప్పుడు ప్రతి విషయంలోనూ భారాన్ని దేవుడిపైనే వేస్తున్నాను. దేవుడు నేను ఏది కోరుకుంటే అది ఇవ్వకుండా నాపై దయతో వ్యవహరించాడు అంటూ కాస్త ఆధ్యాత్మిక, వైరాగ్యం కలగలిసిన మాటలను చెప్పింది.