మనిషిని.. రేపు, భవిష్యత్తు అనే కోరికే ముందుకు నడిపిస్తుంది. ఇది నిజమే అయినా కొన్నిసార్లు మాత్రం 'నిన్న నిజం.. నేడు వాస్తవం.. రేపు భ్రమ' అనేది నిజమనిపించకమానదు. రేపటి గురించి ఆశ ఉండవచ్చే గానీ భవిష్యత్తును ఆలోచిస్తూ నేడు అనే వాస్తవాన్ని పాడు చేసుకోవడం మంచిది కాదు. ఇదే విషయాన్ని రకుల్‌ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.
ఈమె 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' అనే చిన్నచిత్రంతో విజయాన్ని అందుకుని ఆ తర్వాత తన తోటి నటీనటులు, తన సమకాలీనులైన హీరోయిన్లను దాటుకుని దూసుకెళ్లి స్టార్ హీరోయిన్ అయింది. బడాబడా స్టార్స్ అందరితో కలిసి నటించింది. ఆమె ఒకానొక దశలో ఎంత బిజీ అయిందంటే పెద్ద పెద్దస్టార్స్‌కి కూడా డేట్స్ ఖాళీలేని పరిస్థితి ఎదురైంది. ఇక 'స్పైడర్' పరాజయంతో ఈమె హవా కాస్త తగ్గింది. కానీ కోలీవుడ్ లో సూర్య, కార్తి ఇద్దరితో నటిస్తోంది.
ఈమె తాజాగా మాట్లాడుతూ, మనం రేపటి శ్వాసను నేడు పీల్చలేం. నేడు పీల్చిన శ్వాసే మనల్ని బతికిస్తుంది. కాబట్టి నేను ఈరోజు, ఇప్పుడు చేయాల్సిన పనుల గురించే ఆలోచిస్తాను. రేపటి గురించిన భయాలు, ఆలోచనలు, ఆందోళనలు నాకు ఉండవు. రేపటి రోజున అవకాశాలు లేకపోతే ఏమవుతుంది? అని ఆలోచించను. కష్టపడటం, వాస్తవంలో బతకడం మాత్రమే నాకు తెలుసు. నా ఆత్మవిశ్వాసమే నాకు శ్రీరామరక్ష అని చెప్పుకొచ్చింది.