తెలుగులో యంగ్ అండ్ క్రియేటివ్ దర్శకుల్లో చంద్రశేఖర్ యేలేటి ఒకరు. వాస్తవానికి ఎంతో ప్రతిభావంతడైన ఈయన సలహాలను ఏకంగా రాజమౌళి కూడా తీసుకుంటూ ఉంటాడు. అలాగని ఈయనకు రొటీన్ చిత్రాలు తీయడం ఇష్టం ఉండదు. 'ఐతే, ఒక్కడున్నాడు. అనుకోకుండా ఒకరోజు, సాహసం'తో పాటు ఇటీవల వచ్చిన 'మనమంతా' వరకు ఈయన తీసిన ప్రతి చిత్రం ఓ కళాఖండమేనని చెప్పాలి. కానీ ఈయన బ్యాడ్‌లక్ ఏమిటంటే ఈయన కమర్షియల్ దర్శకునిగా తనని తాను నిరూపించుకోలేకపోయాడు.
ఇక ఈయనకు ఇంతకాలం గుణ్ణం గంగరాజు, సాయికొర్రపాటి వంటి నిర్మాతలు దన్నుగా నిలిచారు. ఇక ఈయన తాజా కథని సినిమాగా తీయడానికి సంచలన నిర్మాతలుగా,తాము ఏ చిత్రం తీసినా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచే చిత్రాలను నిర్మిస్తోన్న మైత్రిమూవీమేకర్స్ సంస్థ ముందుకు రావడం శుభసూచకం. కానీ చంద్రశేఖర్ యేలేటిలోని క్రియేటివిటీని సరే మైత్రిమూవీమేకర్స్ ట్రాక్ రికార్డును కూడా పట్టించుకోని మన మసాల చిత్రాల హీరోలు వరుసగా ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నారు. ఈ కథ ఇప్పటికే గోపీచంద్, సాయిధరమ్‌తేజ్‌ల వద్దకు వెళ్లి తిరుగుటపా కట్టింది. కారణం ఏమైనా ఈ చిత్రం చివరకు హీరో నితిన్ వద్ద ఆగింది.
ఇక తాజాగా ఈ చిత్రం నుంచి నితిన్ కూడా తప్పుకున్నాడు. దాంతో చంద్రశేఖర్ యేలేటి ఉన్నంతలో కాస్త వైవిధ్యానికి, కొత్త ఆలోచనలను ప్రోత్సహించే నేచురల్ స్టార్ నానికి ఈ కథ చెప్పాడు. ఈ చిత్రం కథ ఎంతో కొత్తదనంతో వైవిధ్యంగా ఉండటంతో, తనకు 'నేనులోకల్, ఎంసీఏ, కృష్ణార్జున యుద్దం' వంటి రొటీన్ చిత్రాలను చేస్తున్నాడు అని ఇటీవలే విమర్శల పరంపర ఎదుర్కొంటున్న నాని దీనికి ఓకే చెప్పాడట. నిజంగా ఇలాంటి దర్శకుడు ఏ కోలీవుడ్, బాలీవుడ్‌లలో ఉండి ఉంటే మన వారే ఈ పాటికి ఆయన వద్ద క్యూ కట్టేవారు.