యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కి ఇటీవల రెండో కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన పెద్ద కూతురు బ్రాహ్మణికి లోకేష్‌లకు దేవాన్షు జన్మించాడు. దాంతో చంద్రబాబు నాయుడు, బాలకృష్ణలకు తాతయ్య హోదా వచ్చింది. ఇక తాజాగా బాలయ్య రెండో కుమార్తె తేజస్విని-శ్రీభరత్‌లకు మార్చి22వ తేదీన తెల్లవారుజామున మరో మగబిడ్డ జన్మించాడు. ఈ పండంటి బాబుకు తాజాగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని బాలయ్య పెద్ద అల్లుడు, ఏపీ మంత్రి నారాలోకేష్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
ఆయన ట్విట్టర్‌లో తెలుపుతూ ఆ పండంటి బిడ్డకు ఆర్యవీర్ అని నామకరణం చేసినట్లు వెల్లడించాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ, 'భరత్, తేజస్వినిలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మిమ్మల్ని తల్లిదండ్రులుగా పొందడం ఆర్యవీర్ అదృష్టం. ఇవి మీకు మధురమైన క్షణాలు' అని తెలిపాడు. ఇక యంగ్‌టైగర్ తనకు పుట్టిన పిల్లలకు తన తాతయ్య ఎన్టీఆర్ రామారావులోని ఏదో ఒక పదాన్ని పేర్లుగా పెట్టుకుంటూ ఉంటే బాలయ్య మాత్రం దేవాన్ష్, ఆర్యవీర్ అంటూ తండ్రి పేరును తన మనవళ్లకు పెట్టుకోకపోవడం గమనార్హం.
మరోవైపు బాలయ్య పెద్దల్లుడు నారాలోకేష్ ఇప్పటికే ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో తాను ప్రత్యక్ష పోటీ చేస్తానని ప్రకటించాడు. మరోవైపు బాలయ్య చిన్నఅల్లుడికి కూడా వైజాగ్ ఎంపీ స్థానం ఇవ్వాలని ఆయన తండ్రి, బాలయ్య వియ్యంకుడు, గీతం విద్యాసంస్థల అధినేత మూర్తి కోరుతున్నవిషయం తెలిసిందే. మరి చంద్రబాబు బాలయ్య చిన్నల్లుడికి సీటు ఇస్తాడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...!