తన మొదటి చిత్రం 'బాణం' నుంచి ప్రతి చిత్రం విభిన్నంగా ఉండేలా చూసుకుంటూ ఉన్నాడు నారా రోహిత్. కాగా ఆయన ఆమధ్య కొన్ని రొటీన్ ఫార్ములా చిత్రాలలో కూడా నటించాడు. నారా రోహిత్ అంటే ఆయన నటించే చిత్రాలు విభిన్నంగా ఉంటాయని భావించే వారు ఈ చిత్రాలను చూసి బాగా నిరుత్సాహ పడ్డారు. హిట్ ఫ్లాప్‌కి అతీతంగా నారా రోహిత్ విభిన్న చిత్రాలలోనే నటించే వారి సంఖ్య బాగానే ఉంది. ఇక 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రం తర్వాత నలుగురు యంగ్ హీరోలు కలిసి నటించిన 'శమంతకమణి' చిత్రం వచ్చింది. ఇక ఇంతకాలం తర్వాత ఆయన నటించిన మరో విభిన్న కథా చిత్రమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో 'వీరభోగ వసంతరాయలు' వస్తోంది.
తాజాగా ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేశారు. నిజానికి ఈ చిత్రం టైటిల్ 'వీరభోగ వసంతరాయలు'నే వినడానికి ఎంతో భిన్నంగా ఉంది. ఇక ఈ పోస్టర్‌లో ఓ వ్యక్తిని తల్లకిందులుగా కట్టివేసిన స్టిల్ సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఇక ఈ చిత్రానికి ఇంద్రసేన దర్శకత్వం వహించడంతో పాటు ఇందులో సుధీర్‌బాబు, శ్రీవిష్ణు, శ్రీయ వంటి వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గతంలో 'అప్పట్లో ఒకడుండేవాడు'లో నారారోహిత్, శ్రీవిష్ణులు కలిసి నటించారు. ఇక తాజాగా 'వీరభోగ వసంతరాయలు'లో మరోసారి వీరిద్దరు కలిసి నటిస్తుండటం విశేషంగా చెప్పాలి.
ఈ చిత్రం గురించి హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ, 'దర్శకుడు ఇంద్రసేన మొదటి సారి ఈ కథను నాకు చెప్పినప్పుడు నాకేమీ అర్ధం కాలేదు. రెండురోజుల పాటు ఆలోచనలో పడిపోయాను. ముందుగా ప్రేక్షులకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆ తర్వాత అసలు విషయం అర్దమవుతూ వెళ్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అనూహ్య మార్పులతో కూడి చేసిన వారి మైండ్ బ్లోయింగ్ చేసే చిత్రం ఇది. మరలా ప్రేక్షకులకు ఇలాంటి చిత్రమే కావాలంటే ఇంద్రసేన మాత్రమే తీయాలి. ఇంతవరకు ఇలాంటి చిత్రం వెండితెర మీద రాలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఇంత వరకు సినిమాలలో నేను పడిన కష్టం వేరు. ఈ సినిమా కోసం పడిన కష్టం వేరు. నిజం చెప్పాలంటే దర్శకుడు ఇంద్రసేన నన్ను టార్చర్ పెట్టాడు' అని నవ్వుతూ శ్రీవిష్ణు చెప్పుకొచ్చాడు.