తెలుగులో తమిళస్టార్ సూర్యకి మంచి హిట్ వచ్చి చాలా కాలమే అయింది. ఏదో '24' చిత్రం మాత్రం కమర్షియల్‌గా ఓకే అనిపించింది. ఇక ఆయన సోదరుడు కార్తికి మాత్రం తెలుగులో 'ఊపిరి'తో పాటు 'ఖాకీ' వంటి హిట్ కూడా ఉంది. ప్రస్తుతం కార్తి తన అన్నయ్య సూర్య నిర్మిస్తుండగా, పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'చినబాబు' చిత్రంలో నటించాడు. ఇందులో ఆయన రైతుగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రైతుల సమస్యలను గురించి చర్చించడమే కాదు.. లాయర్లు, డాక్టర్లు, జర్నలిస్ట్‌లు తమ వాహనాలపై స్టిక్కర్లు అంటించుకున్నట్లుగా రైతులు కూడా ఫార్మర్ అని స్టిక్కర్లు గర్వంగా అంటించుకునే రోజు రావాలనే సామాజిక సందేశం కూడా ఇందులో ఉంటుందట.
ఈ చిత్రం పూర్తిగా రైతుల కష్టాలు, రైతు అంశాలతోనే కాదు.. కుటుంబ విలువలు, పల్లెటూరి ఆప్యాయతల నేపధ్యంలో కూడా సాగుతుందని కార్తి అంటున్నాడు. ఇక తమ పెదనాన్న రైతు అని, తన భార్య పుట్టింటి వాళ్లు కూడా రైతులేనని చెప్పుకొచ్చాడు. ఇక ఈ 'చినబాబు' చిత్రం శుక్రవారం విడుదలవ్వగా, ఈ చిత్రం వీడియో ప్రోమోను తెలుగులో సెన్సేషనల్ స్టార్ విజయ్‌దేవరకొండ విడుదల చేశాడు. దీనికి సూర్య విజయ్‌దేవరకొండకి థ్యాంక్స్ చెప్పి, త్వరలో కలుద్దాం అని ట్వీట్ చేశాడు.
దానికి విజయ్ స్పందిస్తూ 'నేను ఎంతగానో ఆరాధించే నటుడు సూర్య నిర్మాతగా, నేను బాగా అభిమానించే నటుడు కార్తి హీరోగా వస్తున్న 'చినబాబు' చిత్రం ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించాడు. ఇక విజయ్ సూర్యని ఉద్దేశించి.. మీ నుంచి క్రమశిక్షణ కొంచెం నేను నేర్చుకోవాలని ట్వీట్ చేశాడు. ఇక ఈ 'చినబాబు' చిత్రంలో 'అఖిల్' భామ సాయేషా సైగల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు సూర్య.. సెల్వరాఘవన్ చిత్రంతో బిజీగా ఉంటే విజయ్‌దేవరకొండ అరడజను చిత్రాలు చేతిలో పెట్టుకుని ఉన్నాడు. ఇందులో మొదటగా 'గీతాగోవిందం' విడుదల కానుండగా తదుపరి టాక్సీవాలా విడుదల కానుంది.