సినీ ప్రపంచంలోని వారు బయటికి కనిపించినా మేకప్‌తోనే కనిపిస్తూ ఉంటారు. తమ ఒరిజినల్ గెటప్‌ని, అవతారాన్ని చూస్తే ప్రేక్షకులు భయపడతారని భావిస్తూ ఉంటారు. అందుకే నేడున్న చాలా మంది స్టార్స్‌కి తలపై జట్టులేకపోయినా కూడా విగ్గు, హెయిర్ ప్లాంటేషన్ వంటివి లేకుండా బయటకు అడుగుపెట్టరు. ముసలి వయసు వచ్చిన తర్వాతే అందాల సోగ్గాడుగా పిలవబడే శోభన్‌బాబు వృద్దాప్యం వల్ల తనలో వచ్చిన మార్పులను జీర్ణించుకోలేక డిప్రెషన్‌కి లోనయ్యేవాడు. ఒకప్పుడు మహిళా ప్రేక్షకుల ఆరాధ్యదైవం, ఫ్యామిలీ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సాధించిన తర్వాత సినిమాలకు తొందరగా గుడ్‌బై చెప్పేసి ఆ తర్వాత ఎన్నో చాన్స్‌లు వచ్చినా నో చెప్పాడు. ప్రేక్షకుల మదిలో నాటి శోభన్‌బాబే ఉండాలని, తాను ఈ వయసులో వచ్చిన మార్పులు కనిపిస్తే తనకు విలువ తగ్గుతుందని ఆయన భావించేవారు.
ఇక ఏయన్నార్‌ని కూడా విగ్గు లేకుండా బట్టతలతో తాతయ్య పాత్రలో 'సీతారామయ్య గారి మనవరాలు' చిత్రంలో క్రాంతి కుమార్ ఎంతో పట్టుబడితే గానీ ఒరిజినల్ గెటప్‌తో నటించడానికి ఏయన్నార్ అంగీకరించలేదని ఆ చిత్ర దర్శకుడు స్వర్గీయ క్రాంతికుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ విషయంలో ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి మాత్రమే మినహాయింపు ఉంది. ఆయన రీల్‌పై ఎలాంటి మ్యాజిక్‌లు చేసి మెప్పిస్తాడో, నిజజీవితంలో బట్టతల, నెరిసిన జట్టు, గుబురుగా ఉండే తెల్లని గడ్డంతో కనిపిస్తూ ఉన్నా ప్రేక్షకులు ఆయనను ఆదరించడం మానలేదు. ఇక ఆయన ఈ వయసులో కూడా ఫిజిక్‌ని బాగా మెయిన్ టెయిన్ చేస్తాడు. ఈ వయసులో ఈయన ఫిట్‌నెస్ చూసి శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాకరే కూడా ఒకసారి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక తమ మీద తామే జోక్‌లు వేసుకునే సుగుణం కూడా రజనీలో ఉంది. దానికి ఓ తాజా సంఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు.
రజనీకాంత్‌కి ఆప్తమిత్రుడు, తమిళనాడు రాజకీయ వేత్త ఏసీ షణ్ముగంను ఇటీవల చెన్నైలో డాక్టరేట్ ఇచ్చి గౌరవించారు. ఈ వేడుకకు రజనీ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ, వయసు పెరిగినా షణ్ముగం హెయిర్ స్టైల్ చాలా బాగుంటుందని, ఆయన తన జుట్టు విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాడో తెలిస్తే జుట్టు లేని తామంతా ఆయన కిటుకులను పాటిస్తామని చెప్పి సభను నవ్వులతో హోరెత్తించాడు. షణ్ముగం ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా ఉండటం వల్లే ఆయనకు అంత గ్లామర్ ఉందని రజనీ ప్రశంసల్లో ముంచెత్తాడు...!