యంగ్‌టైగర్.. ఆయన వెండితెరపై నటిస్తున్నాడంటే నవరసాలలోనూ అదరగొడతాడని అందరి నమ్మకం. ఇక ఈయన ఈమధ్య బాగా మేకోవర్ చెంది లుక్స్‌పరంగా కూడా అదరగొడుతున్నాడు. 'టెంపర్, నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్, జైలవకుశ'లతో పాటు ఆమధ్య విడుదలైన 'అరవింద సమేత వీరరాఘవ' ఫస్ట్‌లుక్స్‌లో కూడా ఒంటిపై చొక్కాలేకుండా బాడీ బిల్డింగ్ చేసిన బాడీతో కొడవలి వంటి ఆయుధాన్ని పట్టుకున్న రఫ్ లుక్‌లోనూ, సాఫ్ట్‌లుక్‌లోనూ మైమరిపించాడు. ఇక ఈయన సినిమాలలో ఇచ్చే ఫోజులు, చెప్పే డైలాగ్స్, ముఖ్యంగా ఈయన డ్యాన్సింగ్ స్టైల్ వంటివి అందరినీ మెస్మరైజ్ చేస్తాయి. ఎన్టీఆర్ అభిమానులు కానీ వారు కూడా ఆయన ఫోజులకి ఫ్లాట్ అవుతారు.
ఇక విషయానికి వస్తే నటీనటులు తెర మీద ఎలా ఉంటారో తెర వెనక అలాగే ఉండాలని లేదు. వారికి కూడా కొన్ని ఫోబియాలు ఉంటాయి. డ్యాన్స్ చేయమన్నా, పదిమంది మధ్యలో నటించడమన్నా పవన్‌కి సిగ్గెక్కువ. ఇక మహేష్ కూడా తనకి కొన్ని విషయాలలో మొహమాటం అని చెప్పాడు. ప్రభాస్ కూడా తెరవెనుక ఎంతో సాఫ్ట్‌గా కనిపిస్తూ ఉంటాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ ఓ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫొటోలకు ఫోజులివ్వాలంటే నాకు ఎక్కడ లేని వణుకు వస్తుంది. అందుకే సెల్ఫీలు, ఫొటోలు తక్కువగా దిగుతాను. తాజాగా జరిగిన ఫొటో షూట్ చేసేటప్పుడు కూడా ఫోజులివ్వాలంటే నాకు వణుకు పుట్టింది. అయితే నేను గేమ్స్ బాగా ఆడుతుంటాను. నచ్చిన గేమ్స్‌ని ఎక్కువగా డౌన్‌లోడ్ చేస్తుంటాను. చిన్నప్పటి నుంచి సెల్‌ఫోన్ లేకుండా ఎప్పుడు లేను. ఫీచర్స్ వాడకపోయినా కనీసం ఫోన్‌లో మాట్లాడేందుకైనా అది అత్యంత అవసరం. ఇప్పుడు నాకు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధ్యత పెరిగింది. డిజిటల్ డిటాక్స్ తీసుకోవాలని ఉంది. ఇప్పటి వరకు చాలా రేర్‌గా మాత్రమే ఫోన్ లేకుండా ఉన్నాను.
ఇక నా ఫోన్‌లో గేమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈమధ్య యూట్యూబ్ కూడా చేరింది. నా పిల్లాడు రెయిమ్స్ చూస్తుంటాడు. తాజాగా ఫోన్‌లో నా ఇంటర్వ్యూని వాడు చూశాడు. నేను ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు మొదటి ఫోన్ కొన్నాను. జగదీష్ మార్కెట్‌లో ఓ సెకండ్ హ్యాండ్ మొబైల్‌ని కొనుకున్నాను. నా భార్యకి కూడా నన్ను ఫొటోలు తీసి ఆల్బమ్‌లో పెట్టాలని కోరిక. కానీ నేను చిక్కను. ఇటీవల మెటర్నిటీ ఫోటో షూట్ జరిగింది. మూడు ఫొటోలుదిగి పారిపోయాను.. అని చెప్పుకొచ్చాడు.