సహజంగా సినిమా ఫీల్డ్‌లో ఒకరిని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథలు సదరు హీరోలకు నచ్చకపోతే అవి ఇతరుల వద్దకు వెళ్తూ ఉంటాయి. వాటిలో కొన్ని మంచి విజయం సాధించి ఆయా నిరాకరించిన హీరోలకు బాధని మిగిలిస్తే మరికొన్ని చిత్రాలు ఆయా హీరోల జడ్జిమెంట్ నిజమేనని నిరూపిస్తూ ఫ్లాప్‌లను నమోదు చేస్తాయి. పవన్‌కళ్యాణ్ కోసం రాసుకున్న కథల ద్వారానే రవితేజ మాస్‌మహారాజా అయ్యాడు. ఇక మహేష్‌బాబు, ఎన్టీఆర్ వంటి వారు కూడా కొన్ని చిత్రాలలో నటించకుండా తప్పు చేస్తే కొన్నిసార్లు మంచే చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలుగులో కూడా బోల్డ్ చిత్రాల హవా సాగుతోంది. ఆ మధ్య వచ్చిన 'అర్జున్‌రెడ్డి' నుంచి తాజాగా విడుదలైన 'ఆర్‌ఎక్స్ 100' వరకు ఈ తరహా చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో తాను నటించి ఉండాల్సిందని, కానీ 'అర్జున్‌రెడ్డి' ద్వారా వచ్చిన ఇమేజ్ తర్వాత ఇలాంటి చిత్రం చేయడం కరెక్ట్ కాదని నిరాకరించానని ఆల్‌రెడీ విజయ్‌దేవరకొండ స్పష్టం చేశాడు.
అదే విధంగా ఈ చిత్రం ముందుగా మరో హీరో వద్దకు కూడా వెళ్లిందట. అతను ఎవరో కాదు.. సూపర్‌స్టార్ మహేష్‌బాబు బావ సుధీర్‌బాబు. ఈ కథ నచ్చి చేద్దామని సుధీర్‌బాబు భావించినప్పటికీ ఎందుకోగానీ చివరకు నో చెప్పాడట. ఇదే సమయంలో గతంలో తాను వారాహిచలన చిత్రం వారి 'ఊహలు గుసగుసలాడే' చిత్రం కూడా మిస్ అయినట్లు గతంలో సుధీర్‌బాబు తెలిపాడు. ఆ చిత్రం ద్వారా ఒక హిట్‌ని మిస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన 'ఆర్‌ఎక్స్ 100' ద్వారా మరో విజయాన్ని మిస్ చేసుకున్నాడని తెలుస్తోంది. ఒకానొక దశలో ఈ చిత్రంలో నటించడమే కాదు.. నిర్మాతగా కూడా తానే వ్యవహరించాలని సుధీర్ భావించాడట.
అదే నిజమైతే హీరోగానే కాదు... నిర్మాతగా కూడా ఆయన ఓ మంచి చాన్స్‌ను మిస్ అయ్యాడనే చెప్పాలి. అయినా మహేష్‌బాబు బావగా పేరున్న సుధీర్‌బాబు అంత బోల్డ్ సీన్స్‌లో నటించి ఉండే వాడా? నటించినా కార్తికేయను ఆదరించినట్లుగా ఈ చిత్రంలో సుధీర్‌ని ప్రేక్షులు స్వీకరించేవారా? ఇప్పటివరకు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్న సుధీర్‌బాబు ఇందులో నటించి ఉంటే ఫలితం ఎలా ఉండేది? అనే ప్రశ్నలు ఉదయించకమానవు. మరి 'సమ్మోహనం' కూడా మంచి విజయం సాధించడంతో సుధీర్‌బాబు మరీ పెద్దగా బాధపడాల్సింది ఏమీ లేదనే చెప్పాలి.