'బయోపిక్'ల హవా నడవడం కాదు పరిగెడుతున్న తరుణమిది. జనాలకి ఈ ప్రేమకథలు, మాస్ సినిమాలు బోర్ కొట్టేయడంతో వారికి తెలిసినవారి జీవితాలను తెరపై చూడడానికి సుముఖత చూపుతున్నారు. దాంతో పొలిటీకల్, స్పోర్ట్స్, సినిమా ఇలా అన్నీ ప్రముఖ రంగాల నుంచి ప్రముఖుల జీవితాలను, చరిత్రలో ప్రముఖంగా పేర్కొన్న సంఘటనలను సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. వాటిలో కొన్ని కోట్లు గడిస్తుంటే.. కొన్ని మాత్రం బోల్తా కొడుతున్నాయి. అయితే.. ఈమధ్యకాలంలో బాగా హైప్ వచ్చిన బయోపిక్స్ రెండున్నాయి. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' ఒకటి కాగా, జనం మెచ్చిన నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న 'యాత్ర'. ఈ రెండు చిత్రాల్లో కామన్ పాయింట్ ఒకటి ఉంది. ఎన్టీఆర్, వైయస్సార్ లు ఇద్దరూ తమ పార్టీలను స్వయంగా బలోపేతం చేసి, ముఖ్యమంత్రులుగా రెండు పర్యాయాలు గెలిచినవారే.
ఇప్పుడు ఈ ఇద్దరి జీవితాల ఆధారంగా తెరకెక్కనున్న చిత్రాలకూ ఒకే విధమైన ఎండింగ్ రాసుకొన్నారట సదరు చిత్రాల దర్శకులు. రెండు సినిమాలూ వాళ్ళు ముఖ్యమంత్రులుగా గెలవడంతో ముగుస్తాయని వినికిడి. నిజానికి.. ఎన్టీఆర్, వైయస్సార్ ల జీవితాల్లో విశేషమైన మార్పులు చోటు చేసుకొంది వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యాకే.. అప్పటివరకూ వారి జీవితాలు సాదాసీదాగా సాగితే.. ముఖ్యమంత్రులు అయ్యాక రసవత్తరమయ్యాయి. అలాంటిది రెండు బయోపిక్స్ లోనూ ముఖ్యమంత్రి అయ్యాక ఏం జరిగింది అనేది చూపకపోవడం అనేది నిరాశకు గురి చేస్తోంది. లేనిపోని కాంట్రవర్సీలు ఎందుకు అనుకోని అలా వదిలేస్తున్నారా లేక మరేదైనా కారణం ఉందా అనేది తర్వాత ఎలాగూ తెలుస్తుందనుకోండి. చూద్దాం మరి ఏమవుతుందో.