ఈమధ్యన దర్శకుడు హరీష్ శంకర్ కి నిర్మాత దిల్ రాజుకి చెడిందనే న్యూస్ కొన్ని వెబ్సైట్ లో దర్శనమిచ్చింది. హరీష్ శంకర్ ని డీజే సినిమా అప్పటినుండి దిల్ రాజు మళ్ళీ తన బ్యానర్ లోనే సినిమా చేసేలా ఒప్పించుకున్నాడు. అయితే హరీష్ శంకర్ డీజే దువ్వాడ జగన్నాధం సినిమా తర్వాత దాగుడుమూతలు సినిమాని దిల్ రాజు బ్యానర్ లో ఇద్దరు మీడియం హీరోలతో మొదలు పెడతాడని... అన్నారు. ఇక దిల్ రాజు కూడా హరీష్ శంకర్ ని తన సినిమా ప్రెస్ మీట్స్ కి తీసుకెళ్లడం వంటివి చేసేవాడు. కానీ ఈమధ్య కాలంలో అంటే ఒక పది రోజుల నుండి హరీష్ శంకర్ కి దిల్ రాజుకి మధ్య విభేదాలొచ్చాయనే టాక్ నడుస్తుంది.
తాజాగా హరీష్ చేసిన ట్వీట్ ఒకటి అది నిజమనిపించేలానే ఉంది. దిల్ రాజు నిన్న బుధవారం జరిగిన లవర్ మూవీ ఇంటర్వ్యూలో లవర్ సినిమా ప్రమోషన్స్ తో పాటుగా తన బ్యానర్ లో రాబోతున్న ఐదు సినిమాల విడుదల తేదీలను ప్రకటించాడు. తన నిర్మాణంలో తెరకెక్కిన రాజ్ తరుణ్ లవర్ మూవీ నెల 20న అంటే రేపు రిలీజ్ అవుతుంటే... నితిన్ - రాశి ఖన్నాలు జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీనివాస కల్యాణం ఆగస్టు 9 న విడుదలవుతుంది. ఇక రామ్ - అనుపమల హలో గురు ప్రేమ కోసమే అక్టోబర్ 18 న విడుదలవుతుందని..... అలాగే 2019 లో సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెంకటేష్ - వరుణ్ మల్టీస్టారర్ ఎఫ్2, మహేష్ - పూజ హెగ్డే జంటగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న మహేష్ 25 మూవీ ఏప్రిల్ 5న విడుదలవుతున్నాయని దిల్ రాజు చెప్పాడు.
మరి దిల్ రాజు ప్రకటించిన ఆ ఐదు సినిమాల లిస్ట్ లో తన సినిమా లేదని హరీష్ శంకర్ ట్వీట్ చేసాడు. ఆ లిస్ట్ నుండి తన సినిమా మిస్ అయ్యిందని.. ఒక్కోసారి అలాంటివే జరుగుతుంటాయని... ఆ లిస్ట్ లో తన సినిమా లేకపోవడం బాధేసిందని.. అయినా దిల్ రాజుగారి నిర్మాణంలో వస్తున్న ఆ ఐదు చిత్రాలు ఘన విజయం సాధించాలని హరీష్ శంకర్ కోరుకుంటున్నట్లుగా ట్వీట్ చేసాడు. మరి నిజంగానే హరీష్ కి దిల్ రాజుకి చెడిందా? లేదా ఇంకా సినిమా స్టార్ట్ చెయ్యకుండా దిల్ రాజు మాత్రం హరీష్ సినిమా డేట్ ఎలా ప్రకటిస్తాడు. అందుకే హరీష్ శంకర్ తో తన నిర్మాణంలో తెరకెక్కబోయే దాగుడు మూతలు సినిమా గురించిన విషయాలేమి చెప్పకుండా దిల్ రాజు దాటేసి ఉండొచ్చు. సో ఏదైనా జరగొచ్చు.