నిజానికి ప్రాణాంతక వ్యాధులు వచ్చినప్పుడు వాటిని మనో నిబ్బరంతో ఎదుర్కోవడం చెప్పినంత సులువు కాదు. ముఖ్యంగా ఆ విషయాన్ని తమ అత్యంత సన్నిహితులు, బంధువులు, భర్త, తల్లిదండ్రులు మరీ ముఖ్యంగా పెద్దగా వయసులేని తమ చిన్నారులకు ఎలా చెప్పాలి? అసలు చెప్పాలా? చెప్పకూడదా? అనేది కూడా కత్తిమీద సామే. ప్రస్తుతం హైగ్రేడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రముఖ నటి సోనాలి బింద్రేది కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో చికిత్స పొందుతోంది. కీమో థెరపి నిమిత్తం జుట్టు కూడా కత్తిరించారు. అయితే తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నవిషయాన్ని తన 12ఏళ్ల కుమారుడు రణవీర్‌కి ఎలా చెప్పాలా? అనే విషయంలో ఆమె ఎంతో సతమతమయ్యాననని చెప్పుకొచ్చింది. వ్యాధి గురించి తెలిసి 12ఏళ్ల చిన్నారి అయిన రణవీర్ ఎలా ఫీలయ్యాడో తెలుపుతూ ఆమె ఇన్‌సాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
'రణవీర్ కి జన్మించినప్పటి నుంచి వాడే నా హృదయానికి యజమాని అయ్యాడు. అప్పటి నుంచి మా ఇద్దరి జీవితాలు సంతోషంతో నిండిపోయాయి. కానీ నాకు క్యాన్సర్ ఉందని తెలిసినప్పటి నుంచి ఈ విషయాన్ని వాడికి ఎలా చెప్పాలి? అసలు చెప్పాలా? వద్దా? అని నేను, నా భర్త గోల్డీ సతమతమయ్యాం. మా ఇద్దరికి వాడి సంరక్షణే ముఖ్యం. ఇప్పటివరకు వాడి దగ్గర ఏ విషయం దాచిందిలేదు. మొత్తానికి ధైర్యం చేసి వాడికి నా వ్యాధి గురించి చెప్పాను. కానీ రణవీర్‌లో నాకు ఎలాంటి భయం కనిపించలేదు. సమస్యను అర్ధం చేసుకున్నాడు. నాకు మరింత ధైర్యం, బలం వచ్చినట్లు అనిపించింది. కొన్ని సందర్భాలలో వాడే నాకు ఇప్పుడు అన్ని అయి చూసుకుంటున్నాడు. నేను చేయాల్సిన పనులను వాడే నాకు గుర్తు చేస్తున్నాడు.
ఇలాంటి విషయాలను పిల్లలతో పంచుకోవడం అనేది ముఖ్యమని నేను భావిస్తాను. వారిని బాధపెట్టకూడదని చెప్పకుండా బదులు వారితో మరింత సమయం గడపడం మంచిది. ఇప్పుడు రణవీర్‌తో కలిసి నేను ఆనందకరమైన క్షణాలను గడుపుతున్నాను. వాడి అల్లరితో నాకు జీవితంలో మరలా వెలుగు వచ్చినట్లుగా ఉంది.. అని సోనాలి భావోద్వేగంతో చెప్పుకొచ్చింది. నిజంగా ఇది క్లిష్ట పరిస్థితేనని, చెప్పినంత సులువు కాదు.. ఆచరించడమనేది నిజం.