సినిమా హిట్టా ఫట్టా అనేది సాధారణంగా ఆయా దర్శకులకు వచ్చే చాన్స్‌లను బట్టి అంచనా వేయవచ్చు. కొన్నిసార్లు మాత్రమే నిజమైన హిట్ ఇచ్చిన వారికి కూడా అవకాశాలు ఉండవు. కానీ ఇది చాలా అరుదు. మిగిలిన హిట్ ఇచ్చిన వారికి అందునా స్టార్స్‌తో హిట్స్ ఇచ్చేవారికి నిజంగా గ్యాప్ రాదు. మిగిలిన హీరోలు కూడా వారి కోసం క్యూలలో ఉంటారు. ఇక 'డిజె' చిత్రం విషయంలో అది అద్భుతమైన హిట్ అని, కావాలనే రివ్యూలు, సోషల్ మీడియాలో దానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని ఈ చిత్రం విడుదల అయినప్పుడు అల్లుఅర్జున్, దిల్‌రాజు, హరీష్‌శంకర్‌లు వాదించారు. హరీష్ అయితే మరీ రెచ్చిపోయాడు. తనకు వరుస అవకాశాలు వేచిచూస్తున్నాయని, కానీ తాను దిల్‌రాజుతోనే కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రంగా 'దాగుడు మూతలు' చిత్రాన్ని మల్టీస్టారర్‌గా తీస్తానని చెప్పి అమెరికా వెళ్లి లొకేషన్లను చూస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
కానీ ఇల్లు అలకగానే పండగ కాదన్నట్లు లొకేషన్ల ఫొటోలు విడుదల చేసినంత మాత్రాన నిర్మాత దొరకడు. ఇక తాజాగా దిల్‌రాజు ఓ ఇంటర్వ్యూలో 'దాగుడుమూతలు' కథ విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయని, ఇంకా ఫైనల్ కాలేదని క్లారిటీ ఇచ్చాడు. ఇక హరీష్ శంకర్‌కి మెగా కాంపౌండ్ దర్శకునిగా పేరుంది. ఇప్పటికే ఆయన పవన్‌కళ్యాణ్, అల్లుఅర్జున్, సాయిధరమ్‌తేజ్‌లతో చిత్రాలు తీశాడు. ఈయన తదుపరి చిత్రం చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్‌తోనేనని ప్రచారం సాగుతోంది. ఇటీవల 'విజేత' చిత్రం ద్వారా కళ్యాణ్‌దేవ్ పరిచయం అయ్యాడు. ఈ చిత్రం భారీ నష్టాలను ఎదుర్కోక తప్పలేదు. అయినా కళ్యాణ్‌దేవ్ మాత్రం ఫర్వాలేదనిపించాడు. దాంతో రెండో చిత్రానికి గ్యాప్ లేకుండా కళ్యాణ్‌దేవ్‌తో ఓ మాస్ యాక్షన్ చిత్రం చేయించాలని మెగా ఫ్యామిలీ ఆలోచనగా తెలుస్తోంది.
దాంతో అది హరీష్‌శంకర్‌తోనే అని ప్రచారం మొదలైంది. మెగాస్టార్ కూడా ఓకే చేశాడని అంటున్నారు. కానీ దీనిని హరీష్‌శంకర్ ఖండించాడు. మరోవైపు ఈ ఏడాది 'దాగుడు మూతలు' లేనట్లేనని దిల్‌రాజు దాదాపు తేల్చిచెప్పాడు. దీనిని బట్టి 'డిజె' ఎంత పెద్ద హిట్టో హరీష్‌శంకర్, హరీష్ స్టామినా ఏమిటో దిల్‌రాజుకి, 'డిజె, నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'ల ద్వారా అల్లుఅర్జున్‌కి విషయం బాగానే అర్ధమై ఉంటుంది సుమా...!