ఓ యువకుడు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, ఎదురుగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో వీడియో చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న వీడియోను రంగమ్మత్త అనసూయ వీడియో తీసి దానిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇలాంటి వారి వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, నిబంధనలను అతిక్రమించే వారికి కఠిన శిక్షలు విధించాలని కోరింది. అయితే ఓ కారులో వెళ్తున్నయువకుడు చెత్తని రోడ్దుపై వేశాడని అనుష్కశర్మ, విరాట్‌కోహ్లి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అతడిని తిడుతూ ఉన్న వీడియోను ఇలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పెద్ద దుమారాన్నే రేపింది. ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే... ఇలాంటివి చూసేందుకు పబ్లిసిటీ జిమ్మిక్కులుగా కనిపిస్తాయి. అంతేగానీ వారిని ఆ పని చేయవద్దని చెప్పడం మరిచి, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కేవలం పబ్లిసిటీ జిమ్మిక్కులుగా పలువురు భావిస్తున్నారు. అదే పనని సదరు సెలబ్రిటీలే చేసినప్పుడు ఎవరైనా సామాన్యుడు ప్రశ్నిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ మేము సెలబ్రిటీలం కాబట్టి మమ్మల్యే కార్నర్ చేస్తున్నారు. ప్రతి విషయానికి మమ్మల్ని కార్నర్ చేస్తూ వార్తల్లో నిలవాలని చూస్తున్నారంటూ తమ వంతు వచ్చేసరికి మండిపడుతూ, తమ రెండు నాలుకల ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటారు.
ఇప్పుడు అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ నెటిజన్ అయితే అనసూయ గారు.. మీరు చేసింది మంచిపనే అనుకుందాం. కానీ మీ అమూల్యమైన ఆడి క్యూ7 కారు విండో తెరిచి అతడికే ఆ విషయం చెప్పి హెచ్చరించవచ్చు కదా...! ఇప్పుడు మీరు ఈ వీడియోను పోస్ట్ చేయడం వల్ల పోలీసులు అతని డ్రైవింగ్ లైసెన్స్‌ని రద్దు చేస్తే ఆయన డ్రైవర్ ఉద్యోగం పోయి ఆయన కుటుంబం రోడ్డున పడుతుందని మీకు తెలియదా... అని ప్రశ్నించాడు. దానికి సూటిగా సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతూ, అనసూయ ఆ నెటిజన్‌పై ఫైర్ అయింది.
మీ నోర్లను మా మీద ఈజీగా జారుస్తారు. ఇన్ని చెప్పినా మీకు నిజానిజాలు తెలుసుకోవాలనే ఇంగిత జ్ఞానం లేదు. నేను కూడా కష్టపడే సంపాదిస్తున్నాను. మా ఫ్యామిలీ కోసమే మా కష్టం..మా పని. మా ఫ్యామిలీస్‌పై మీకెందుకంత చులకన? మా గురించి ఇష్టం వచ్చినట్లు రాసేటప్పుడు, యూట్యూబ్‌ల్లో పెట్టేటప్పుడు, ఇలా కామెంట్స్ చేసేటప్పుడు మా పని గురించి, మా సంపాదన గురించి, మా ఫ్యామిలీల గురించి మీరు ఎందుకు ఆలోచించరు? మా ఫేమ్ పోయి, మా పనిపోతే మేము మీలా మామూలు ఉద్యోగాలు కూడా చేసుకోలేం. ఇది మీకు తెలియదా? అని క్లాస్ పీకింది. అదే అలా ఆ యువకుడు నడిపినట్లు అనసూయ కారు నడిపి ఎవరో వీడియో తీసి ఉంటే ఆమె వాదన మరోలా ఉండేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.