ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్స్ ఒకదాని మీద ఒకటి పోటీ పడుతూ శరవేగంగా తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే రాజకీయాల్లో మహామహులైన ఎన్టీఆర్ బయోపిక్ తో పాటుగా వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ రూపుదిద్దుకుంటుంది. బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్ దర్శకుడిగా శరవేగంగా జరుపుకుంటుంది. ఇక మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో యాత్రగా వైఎస్ బయోపిక్ రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే విడుదలైన యాత్ర టీజర్ అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. మమ్మట్టి వైఎస్ ఆర్ పాత్ర చేస్తుండగా... ఆయన తండ్రి పాత్రలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు నటిస్తున్నాడు. 2019 ఎన్నికల టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి బరిలో నిలవబోతుందనే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చి తాను ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో చేసిన పాద యాత్రతో ఆయన జననేతగా మారిపోవడమే కాదు.. ఆయన్ని ఆ ప్రజలే రెండుసార్లు ముఖ్యమంత్రిగా కూర్చో బెట్టారు. అయితే రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే... ఆయన ఒక హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన విషయాన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నారు.
అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి బిజినెస్ వ్యవహారాలు చూసుకునేవాడు. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత, జగన్ మోహనరెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠం కోసం తన తండ్రి చేసిన పాద యాత్రని తన ఆయుధంగా ఎన్నుకుని ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా వున్నాడు. అయితే ఇప్పుడు వైఎస్సార్ బయోపిక్ యాత్రలో ఆయన కొడుకు జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే కార్తికి తెలుగు ప్రేక్షకులకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. కార్తీ కోలీవుడ్ లో వచ్చిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అందుకే యాత్ర సినిమాలో కార్తిని జగన్ పాత్రకి ఒప్పించినట్లుగా తెలుస్తుంది. ఇక జగన్ తో ఉన్న అనుబంధంతో కార్తి కూడా ఈ సినిమా చెయ్యడానికి అంగీకరించినట్లుగా తెలుస్తుంది. కానీ ఈ విషయం మాత్రం అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.