బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్.. ఇక తన కెరీర్‌లోనే ప్రియాంకాచోప్రాతో కలిసి నటించనని శపధం పూనాడని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏమిటంటే... సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న 'భరత్' చిత్రంలో మొదట హీరోయిన్‌గా ప్రియాంకాచోప్రాను తీసుకున్నారు. దీనికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. సినిమాలో చేయడానికి అంగీకరించి అగ్రిమెంట్స్‌పై కూడా ప్రియాంకా సంతకం చేసింది.
కానీ తన ప్రియుడు నిక్‌జోనన్‌తో నిశ్చితార్ధం కారణంగా ఆమె అడ్వాన్స్‌ని నిర్మాతకు తిరిగి ఇచ్చివేసి సినిమా నుంచి తప్పుకుందని సమాచారం. కేవలం రెండు రోజుల ముందు ఆమె ఈ విషయాన్ని దర్శకనిర్మాతలు, హీరోలకు తెలిపింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత నిఖిల్ నమిత్ మీడియాకు తెలిపాడు. మరోపక్క సల్మాన్ కూడా ప్రియాంకా పట్ల ఎంతో కోపంగా ఉన్నాడని కథనాలు వచ్చాయి. అయితే సల్లూభాయ్ ఈ ఘటనతో అసలు కోపం తెచ్చుకోలేదని సల్మాన్ తండ్రి సలీం ఖాన్ స్పష్టం చేశాడు. ప్రియాంకా 'భరత్'లో నటించడం లేదు. ఇలాంటివి చిత్ర పరిశ్రమలో మామూలేనని ఆయన తెలిపాడు. ఆమె నటించకపోతే యూనిట్‌కి వచ్చిన నష్టం ఏమీలేదని తేల్చిచెప్పాడు.
ఇక తాజాగా 'భరత్' చిత్రంలో ప్రియాంకాచోప్రా బదులు కత్రినాకైఫ్‌ని తీసుకున్నారు. గత ఏడాది సల్మాన్-కత్రినా కలిసి నటించిన 'టైగర్ జిందాహై' చిత్రం మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకి కూడా అలీ అబ్బాస్ జాఫరే దర్శకత్వం వహించాడు. మరలా తన సినిమాలో అనుకోకుండా కత్రినా ప్రవేశించడంతో దర్శకుడు, నిర్మాత, హీరోలు కూడా సంతోషంగానే ఉన్నారని తెలుస్తోంది.