రాశి కంటే వాసి ముఖ్యం. దీనినే క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని కూడా అంటారు. ఈ విషయాన్ని అక్షరాల పాటించి కేవలం 12 చిత్రాలతోనే శతాధిక చిత్రాల దర్శకులు పొందినంత కీర్తిని పొందిన ఘనత ది గ్రేట్ శంకర్‌కి దక్కుతుంది. ఆయన కోలీవుడ్‌లో కె.బాలచందర్, మణిరత్నం వంటి దిగ్గజాల సరసన నిలుస్తున్నారు. ఎన్ని తీశామన్నది ముఖ్యంకాదు.. తుపాకి దిగిందా? లేదా? అనే డైలాగ్ శంకర్‌కి సరిపోతుంది. ఇక విషయానికి వస్తే శంకర్ ప్రతిభ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన కంటే ఆయన తీసిన చిత్రాలే మాట్లాడుతాయి. మొదటి చిత్రం 'జెంటిల్‌మేన్' నుంచి రాబోయే '2.ఓ' వరకు ఈయన ప్రతిభను చాటే విధంగానే ఉంటాయి. ఆ విషయంలో ఈయన రాజీ పడడు. అలాగే ఎంత కమర్షియల్ సినిమా అయినా, ఎన్ని కోట్ల బడ్జెట్ చిత్రమైనా కూడా అందులో చేదు గుళికల వంటి సందేశాలకు షుగర్ కోటింగ్ ఇవ్వడం ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. దేశంలో నేడు ఉన్న టాప్ 3 దర్శకుల్లో రాజ్‌కుమార్ హిరాణి, శంకర్, రాజమౌళిలనే ప్రముఖంగా చెప్పుకోవాలి.
ఇక శంకర్ దర్శకునిగా మారి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఇంత సుదీర్ఘ కెరీర్‌లో ఆయన తీసిన చిత్రాలు 'జెంటిల్‌మేన్, భారతీయుడు, జీన్స్, ప్రేమికుడు, బాయ్స్, రోబో, ఐ' ఇలా ప్రతిది ఓ ఆణిముత్యమే. ఇక శంకర్ నిర్మాతగా కూడా మారి తన వద్ద దర్శకత్వశాఖలో పనిచేసే నవతరం దర్శకులకు కూడా మంచిలిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. అలా ఆయన నుంచి శిష్యరికం పొందిన వారిలో బాలాజీ శక్తివేలు, అట్లీ, వసంతబాలన్, అరివళగన్ వంటి వారు ఈ సందర్భంగా తమ గురువు శంకర్‌కి ఓ జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా వారందరు ఓ ఫొటో దిగారు. తమ గురువుకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా శంకర్ స్పందిస్తూ, నా సహాయ దర్శకులు చూపిస్తున్న ప్రేమాభిమానాల వర్షంలో తడిసి ముద్దయ్యాను. వాళ్లు లేకుండా నా పయనం సాగేది కాదు... అని వినమ్రంగా తెలిపాడు. ఇక శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్ నటించిన '2.ఓ' చిత్రం నవంబర్ 29న విడుదల కానుండగా, ఆ వెంటనే కమల్‌హాసన్‌తో 'భారతీయుడు 2'ని ఆయన తెరకెక్కించనున్నారు.