త్వరలో బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితంపై బయోపిక్ రూపొందనున్న సంగతి తెలిసింది. ఈ విషయం బయటికి వచ్చి ఎంతో కాలం అయింది. సైనా నెహ్వాల్ పాత్రకు శ్రద్దాకపూర్‌ని కూడా తీసుకున్నారు. దీని కోసం ఆమె బాడ్మింటన్‌లో మెలకువలు నేర్చుకోవడానికి రోజు ప్రాక్టీసుకి కూడా వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక శ్రద్దాకపూర్ సైనా నెహ్వాల్ చిత్రం ఒప్పుకున్న తర్వాత ఆమెకి వరుసగా చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. కేవలం సైనా నెహ్వాల్ పాత్ర కోసం ఎంతో సమయం వెచ్చించి, ఆ సినిమాలో చేసిన సమయాన్ని ఇతర మామూలు చిత్రాలకు కేటాయిస్తే కనీసం ఆ సమయంలో నాలుగైదు చిత్రాలైనా చేయవచ్చని శ్రద్దాకపూర్ భావిస్తోందిట.
దీంతో ముందుగా మాట ఇచ్చిన ప్రకారం ఆమె బాడ్మింటన్ శిక్షణకు వెళ్లకుండా ఇతర చిత్రాలతో బిజీగా ఉందని సమాచారం. ఈ సినిమా నిర్మిస్తున్న అమోల్‌గుప్తా కూడా శ్రద్దాకపూర్ తీరుపై ఆగ్రహంగా ఉన్నాడట. ఈ విషయంలో తాజాగా సైనా నెహ్వాల్ స్పందించింది. ఈ చిత్రానికి ప్రీప్రొడక్షన్ పనులు మొదలు పెట్టి ఏడాదికి పైగా అవుతోంది. నా పాత్రను చేస్తున్న శ్రద్దాకపూర్ ఈ చిత్రంలోని నా పాత్ర కోసం బాడ్మింటన్‌లో శిక్షణ తీసుకోవాల్సివుంది. ఆమె శిక్షణ పూర్తయిన తర్వాతనే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ముందుగానే నిర్ణయించాం. కానీ శ్రద్దాకపూర్ ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టడం లేదని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేసింది. శ్రద్దాకపూర్ ఇప్పుడు చాలా బిజీగా ఉందని, ఈ పరిస్థితుల్లో ఆమె శిక్షణ కోసం సమయం కేటాయించడం కష్టమేనని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
కొందరు నటీనటులు మాత్రం కొన్ని అరుదైన చిత్రాల కోసం మరో సినిమా ధ్యాస లేకుండా మంచి కీర్తిప్రతిష్టలు లభించేలా ఆయా పాత్రల కోసం ఎంత కాలం అయినా కేటాయిస్తారు. ఉదాహరణకు మేరోకోమ్, క్వీన్, పద్మావత్ వంటి చిత్రాలు ప్రియాంకాచోప్రా, కంగనారౌనత్, దీపికాపదుకొనే వంటి వారి కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మరి అంత అరుదైన సైనా నెహ్వాల్ చిత్రాన్ని శ్రద్దాకపూర్ చేయకపోతే అది ఆమె కెరీర్‌లోనే అతి పెద్ద తప్పు అవుతుందని చెప్పవచ్చు.