హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా వుడ్ ఏదైనా కూడా సినీ రంగాన్ని పైరసీ భూతం అనేది పట్టి పీడిస్తోంది. సినిమా విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తోంది. దీనిని రూపుమాపటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి బూడిదలో పోసిన పన్నీరే అవుతున్నాయి. ఇక విషయానికి వస్తే తాజాగా బాలీవుడ్‌లో 'ముల్క్' చిత్రం విడుదలై ఘనవిజయం దిశగా సాగుతోంది. రిషికపూర్, తాప్సి వంటి ప్రముఖులు నటించిన ఈ చిత్రం ఇండో-పాక్, హిందు-ముస్లింల స్నేహం తదితర అంశాలతో రూపొందింది. ఈ సినిమాలో ఉగ్రవాద నేరాల ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటున్న ఇంటి పెద్దగా రిషికపూర్ నటించగా, ఆయన తరపున వాదించే న్యాయవాది పాత్రను తాప్సి పోషించింది.
ఇక ఈ చిత్రంలో ప్రతీక్ బబ్బర్, అశుతోష్‌రాణాలు కూడా కీలకపాత్రలను పోషించారు. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు అనుభవ్ సిన్హా కాస్త డిఫరెంట్‌గా తన చిత్రాన్ని థియేటర్లలో చూడలేకపోతే కనీసం డిజిటల్ ఫార్మాట్‌లో పైరసీ ద్వారా అయినా చూడాలని పిలుపునిచ్చాడు. సాధారణంగా ఏ దర్శకుడైనా పైరసీని ప్రోత్సహించవద్దు. నా చిత్రాన్ని థియేటర్‌లోనే చూడండి.. పైరసీని రూపుమాపండి అని చెబుతాడు. కానీ 'ముల్క్' దర్శకుడు ఇలా తన చిత్రం పైరసీనైనా చూడాలని చెప్పింది భారతీయులకు కాదు. పాకిస్తాన్ ప్రజలకు. ఈ చిత్రాన్ని పాక్ సెన్సార్‌బోర్డ్ తమ దేశంలో విడుదల కాకుండా నిలిపివేసింది.
దీనిపై అనుభవ్ సిన్హా మాట్లాడుతూ, ప్రియమైన నా పాకిస్తాన్ ప్రజలకు... నేను తీసిన ముల్క్ చిత్రంపై మీ సెన్సార్‌బోర్డ్ నిషేధం విధించింది. మీరంతా చట్టబద్దంగా థియేటర్లలో నా సినిమాని చూడాలని నాకు ఉంది. ఒక వేళ కుదరకపోతే పైరసీలోనైనా చూడండి. సినిమా చూసిన తర్వాత పాకిస్థాన్ సెన్సార్‌బోర్డ్ మా చిత్రాన్ని ఎందుకు నిషేధించిందో చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితులను, వాస్తవాలను మీరు చూడకూడదనే సెన్సార్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చాడు. అయినా నిషేధం ఎత్తివేసేలా పోరాటం చేయాల్సిందిపోయి ఇలా పైరసీ చూడమని చెప్పడంపై మాత్రం విమర్శలు వస్తున్నాయి.