ప్రయోగాలు, విభిన్న కథాంశలు, ఎవ్వరూ చేయడానికి సాహసించని పాత్రలను చేయడంలో లోకనాయకుడు కమల్‌హాసన్ ముందుంటారు. 'విచిత్ర సోదరులు'లో మరుగుజ్జుగా, 'పుష్పక విమానం'తో మూకీ మూవీని, ఆ తర్వాత 'ఇంద్రుడు-చంద్రుడు, సాగరసంగమం, స్వాతిముత్యం, ఆకలిరాజ్యం, వసంతకోకిల' ఇలా ఆయన ప్రతి చిత్రం ఆణిముత్యమే. ఎలాంటి పాత్ర చేయాలన్నా ఎంతో కష్టపడి మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌గా నటిస్తాడు. ఈ విషయంలో కమల్‌హాసన్ తర్వాతనే అమీర్‌ఖాన్ పేరు చెప్పుకోవాలి. ఈయన తన కెరీర్‌లో చేసినన్ని ప్రయోగాలు మరో నటుడు చేయలేదని ఘంటాపధంగా చెప్పవచ్చు.
ఇక ఈయన చిత్రాలలో నాట్యంతో పాటు యాక్షన్ సీన్స్‌ని కూడా ఈయన రియల్‌గా చేస్తూ ఉంటారు. ఇలాంటి పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తీసిన చిత్రమే 'విశ్వరూపం'. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'విశ్వరూపం 2'లో ఆయన మరోసారి తన యాక్షన్ సీన్స్‌తో థ్రిల్ కలిగించడానికి రెడీ అవుతున్నాడని ఈ చిత్రం ట్రైలర్‌ని చూస్తేనే అర్ధమవుతుంది. కమల్ స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో నటించిన ఈ చిత్రంలో పూజాకుమార్, ఆండ్రియాలు కూడా నటించారు. ఆగష్టు10వ తేదీన విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం గురించి కమల్‌హాసన్ మాట్లాడుతూ, ప్రేక్షకులకు నచ్చే, మెచ్చే చిత్రాలు తీయాలనేదే నా ఆకాంక్ష. ఇలాంటి చిత్రం మనం ఎందుకు తీయలేదని అందరు భావించే తరహాగా ఈ మూవీ ఉంటుంది. థ్రిల్లర్ చిత్రాలను తీసిన వారి సినిమాలను చూసి వారిని అభినందిస్తూ ఉంటాం. కానీ మనం మాత్రం అలాంటి ప్రయత్నం చేయం.
ఈ సినిమా కోసం రియల్‌గా స్టంట్స్ చేయడాన్ని నేను ఎంతో ఆస్వాదించాను. ఆనందిస్తుంటాను. ఈ చిత్రంలో ఫైట్స్ చేస్తున్నప్పుడు నాకు ఎన్నోసార్లు ఎముకలకు గాయాలయ్యాయి. అదే విధంగా షూటింగ్ సమయంలోనే ప్రశంసలు కూడా లభించాయి. నేను చేసే సాహసాలు నా నటజీవితంలో భాగమే. మనం పనిచేసే చోట ఫైటింగ్ సీన్స్ చేయడం ఎంతో బాగుంటుంది.. అని చెప్పుకొచ్చాడు.